అన్నంలో బల్లి రావడంపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర ఆగ్రహం

అన్నంలో బల్లి రావడంపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర ఆగ్రహం

కేజీబీవీని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి/ దేవరుప్పుల, వెలుగు: బల్లి పడిన అన్నం తిని స్టూడెంట్లు అస్వస్థతకు గురైన ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆదేశించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కేజీబీవీని ఎర్రబెల్లి శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ​శివలింగయ్యతో కలిసి సందర్శించారు. అన్నంలో బల్లి రావడంపై తీవ్ర ఆగ్రహం చేశారు. అస్వస్థతకు గురైన స్టూడెంట్లకు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని సిబ్బందిని నిలదీశారు.

స్కూల్ ​గదులను, ఆవరణ, పరిసరాలను పరిశీలించారు. స్టూడెంట్లతో కలిసి నేలపై కూర్చొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది లేట్​గా వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్లిపోతున్నారని, తామే అన్నం వడ్డించుకొని తింటున్నామని స్టూడెంట్లు మంత్రికి చెప్పారు. ఏ రోజూ భోజనం మంచిగా ఉండదని వివరించారు. అనంతరం సిబ్బంది, టీచర్లతో ఎర్రబెల్లి వేరువేరుగా సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఎంక్వైరీ చేసి దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేవరుప్పుల ఘటన నేపథ్యంలో మిగతా అన్ని స్కూల్స్, హాస్టల్స్ లో వంట మనుషులు, ఏజెన్సీలకు తగు సూచనలు ఇచ్చి, గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. రెగ్యులర్​గా హాస్టల్స్​ను పర్యవేక్షించాలని ఆదేశించారు.