మందులు ఎక్కువ తక్కువ కొనొద్దు

మందులు ఎక్కువ తక్కువ కొనొద్దు
  • అవసరం మేరకే కొనుగోలు చేయండి
  • TSMIDC కి మంత్రి ఈటల ఆదేశం
  • దవాఖానాల్లో గత ఐదేండ్లలో వాడకం వివరాల పరిశీలన
  • ఆ మేరకే హాస్పటళ్లకు సరఫరా

గవర్నమెంట్‌  హాస్పిటల్స్ కు మెడిసిన్స్‌  సప్లై చేసే విధానాన్ని మార్చాలని  ప్రభుత్వం నిర్ణయించింది .ఏటా మందులకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా, హాస్పిటల్స్ లో మందులు అందుబాటులో ఉండడం లేదు. కాస్త ఖరీదైన మందులైతే బయట కొనాల్సిందే. కమీషన్ల కోసం అనవసరమైన మందులు ఎక్కువ కొనడం, కమీషన్‌ లేని వాటిని అసలే కొనకపోవడం ఇన్నాళ్లూ జరిగింది . ఇటీవల ట్రమడాల్‌ ఘటనే ఇందుకు ఉదాహరణ. ఆ ఘటన తర్వాత విచారణ జరిపి సుమారు 3 లక్షల ట్యాబ్లె ట్లను వెనక్కి తెప్పిం చారు. కొన్ని హాస్పటల్స్ లో డాక్టర్లు, ఫార్మసిస్టులు కుమ్మక్కై కొన్ని మందుల్ని అవసరానికి మించి ఇండెంట్‌ పెడుతున్నారు. వీలైనంత మేరకు వాటినే రోగులకు అంటగట్టి మిగిలిన వాటిని గడువు తీరగానే కాల్చివేస్తున్నారు. దీంతో గవర్నమెంట్‌  పైసలు వృథా కావడమే కాకుండా జనానికి అవసరమైన మందులు ఇవ్వలేని పరిస్థితి.

అయితే, ఇకపై ఆస్పత్రుల నుంచి వచ్చే ఇండెంట్లనే నమ్మి మందులు కొనొద్దని, ఆయా ఆస్పత్రులకు వస్తున్న రోగులు, వారికి ఏ రకమైన మందులిస్తున్నారో వాటినే కొనాలని ప్రభుత్వం భావిస్తోంది . ఇందుకు గత ఐదేండ్లలో ఆస్పత్రుల వారీగా వాడిన మందుల వివరాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని TSMIDC అధికారులకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌ సూచించినట్టు తెలిసింది . అధికారులిచ్చే నివేదికఆధారంగానే ఇకపై ఆస్పత్రులకు మందుల సరఫరా ఉండనుంది. దీంతో మందుల వృథాను అరికట్టొచ్చు . ఏ ఏరియాలో ఏ రకమైన జబ్బులు ఎక్కువగా వస్తున్నాయన్నదీ అంచనా వేయవచ్చు.

 అంతా ఆన్ లైన్‌

ఉమ్మడి రాష్ట్రం లో కొంతమంది డాక్టర్లు, ఫార్మసిస్టులు కుమ్మక్కై అవసరం లేకున్నా పెద్దఎత్తున మందులుకొని వాటిని బయట అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వం సమీకృత కొనుగోలు విధానాన్ని తెరపైకి తెచ్చింది. మందులు, ఇతర సామగ్రి కొనుగోలుకు వైద్య,మౌలిక సేవల అభివృద్ధి సంస్థను ప్రారంభించింది . తెలంగాణ వచ్చాక ఈ సంస్థను TS MIDCగా మార్చారు. దీని ద్వారానే అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు కొనుగోలు చేస్తున్నారు. రెండున్నరేండ్లుగా మందుల కొనుగోలు, వినియోగం వివరాలన్నింటినీ డిజిటలైజ్‌ కూడా చేస్తున్నారు. ఆవివరాలు అందుబాటులో ఉన్నా అంతకు ముందువివరాలు తెప్పిస్తున్నారు. ఇక ఆస్పత్రి నుంచి వచ్చే ఇండెంట్‌ నుంచి ట్యాబ్లె ట్‌  రోగికి చేరే వరకూ ప్రతి దశను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు సాఫ్ట్ వేర్‌‌ రూపొందిస్తున్నారు.