
సమాజంలో ఇంకా కుల వివక్షతో పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు మంత్రి ఈటల రాజేందర్. కొట్లాడితేనే హక్కులు వస్తాయని... అడుక్కుంటే రావన్నారు. హైదరాబాద్ లో జరిగిన మహాత్మా జ్యోతిభాపూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రిజర్వేషన్లు ఉన్నా ఉద్యోగాలు లేవని... అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు వచ్చాయన్నారు. సమాజంలో అంతరాలు పోలేదు అనడానికి ఇదే నిదర్శనమన్నారు ఈటల. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడాలన్నారు. ఉస్మానియాలో పేద పిల్లలుంటే, ప్రైవేట్ వర్సిటీల్లో పెద్దవాళ్ళ పిల్లలున్నారని చెప్పారు. విద్యను వ్యాపారం చేశారన్నారు ఈటల. పార్టీలు వేరైనా అన్యాయాలపై అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో పాలకులు విఫలమయ్యారని చెప్పారు. పూలే, అంబేద్కర్ ఆశయాలు అమలు చేసినప్పుడే సమాజంలో అంతరాలు తొలగిపోతాయన్నారు ఈటల.