
బషీర్బాగ్, వెలుగు: మాలలు ఐక్యంగా ఉంటే అనుకున్నది సాధించవచ్చని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలలకు ఎప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లక్డీకాపూల్ లోని వాసవీ సేవా కేంద్రంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో మాల మహానాడు రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
దీనికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తున్నామని, తమ మాల జాతికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. మాలల సింహగర్జనతో కొంత మంది నోర్లు మూతపడ్డాయని, స్పాన్సర్ ప్రోగ్రాం అని ప్రచారం చేసిన వారికి చెంప పెట్టుగా మాలలు సంఘటితంగా తమ శక్తిని చూపెట్టారని పేర్కొన్నారు.
అదే జోష్ ను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఇంతకాలం మాలలు సంఘటితంగా లేకపోవడం వల్లే అన్ని రంగాల్లో నష్టపోయారని, తాను ఎంపిరికల్ డేటా పరిశీలిస్తే జరిగిన అన్యాయం తెలిసిందన్నారు. మాలలకు జరిగిన అన్యాయంపై ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఎస్సీ వర్గీకరణ కారణంగా రోస్టర్ విధానంలో గ్రూప్ 3లో మాలలకు జరిగే నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
దళితులకు18 శాతం రిజర్వేషన్లు పెంచేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాలలు తన వెంట ఉంటే చాలని, మాలజాతి బాగుకోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానన్నారు. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే తాను అండగా ఉంటానని, వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. రోస్టర్ విధానం లోపభూయిష్టంగా ఉందని, దీని కారణంగా మాల విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, ఉద్యోగుల ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందన్నారు.
అంతకుముందు మంత్రి వివేక్ వెంకట స్వామిని మాల మహానాడు నాయకులు సన్మానించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, నాయకులు రాజు వస్తాదు, డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి, సరళ, బి.విజయ భాస్కర్, కోటేశ్వర రావు, కర్ణం కిషన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.