రోడ్లు మీద వడ్లు.. రిసార్ట్ లో మంత్రి

రోడ్లు మీద వడ్లు.. రిసార్ట్ లో మంత్రి

రాష్ట్ర సర్కారు వడ్ల కొనుగోళ్లు లేట్​ చేస్తుండడంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా వడ్ల కుప్పలే దర్శనమిస్తున్నాయి. మొన్నటి దాకా వర్షాలు పడడంతో వడ్లలో తేమ ఎక్కువగా ఉంటోంది. 17శాతానికి మించి మాయిశ్చర్​ ఉంటే కొనబోమని మిల్లర్లు చెబుతుండడంతో ఆరబోసేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.  సెంటర్లలో సరిపడా జాగ లేక ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఆరబోస్తున్నారు. చాలా మంది రైతులు రోడ్ల మీద ఆరబోస్తుండగా,  ములుగు జిల్లా చాల్వాయిలో రైతులు శ్మశానంలో వడ్లు ఆరబోయడం గమనార్హం. 

కరీంనగర్, వెలుగు:  రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ఆశించినంత స్పీడ్​ అందుకోకపోవడంతో రైతులు రోజుకోచోట ఆందోళనకు దిగుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకొని నిరసన తెలుపుతున్నారు. వర్షాలకు వడ్లు తడిసిన రైతులు రోడ్ల మీద ఆరబోసుకొని అరిగోస పడుతుంటే,  కొందరు రైతులు కుప్పల మీదనే  ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి టైంలో ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ కొనుగోళ్లను స్పీడప్​ చేయాల్సిన సివిల్​ సప్లై మినిస్టర్​ గంగుల కమలాకర్ ఐదు రోజులుగా రాష్ట్రంలోనే లేరు. కరీంనగర్​ లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లందరినీ బెంగళూరు క్యాంపుకు తీసుకెళ్లిన మంత్రి వాళ్లతో సరదాగా గడుపుతూ ఆ ఫొటోలను ట్విటర్​లో పెట్టుకుంటున్నారు.

నాలుగోవంతూ కొనలే.. 
ఈ వానకాలం 6,877 సెంటర్ల ద్వారా 1.03 కోట్ల టన్నుల వడ్లు సేకరించాలని సివిల్​ సప్లై శాఖ టార్గెట్​ పెట్టుకుంది. కానీ మంగళవారం సాయంత్రం వరకు 6,385 కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 25.32 లక్షల ​టన్నుల వడ్లను రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. ఇది టార్గెట్​లో కేవలం 24.35 శాతం మాత్రమే. 492 సెంటర్లను ఇప్పటికీ ఓపెన్ ​చేయలేదు. మాయిశ్చర్​ పేరుతో సెంటర్ల నుంచి వచ్చే వడ్ల లోడ్లను మిల్లర్లు దింపుకోవట్లేదు. దీంతో ఓపెన్​ చేసిన చాలా సెంటర్లలో కాంటాలు బంద్​ పెట్టారు. తేమ తగ్గించేందుకు రైతులు సెంటర్లలో, రోడ్లమీద వడ్లను ఆరబోసుకుంటూ తిప్పలు పడుతున్నారు. ఆరబోసి తీసుకెళ్లినా కాంటాలు పెట్టట్లేదని రోడ్లెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ఇంకా 75 శాతం వడ్లు కల్లాల్లోనే ఉండడంతో వాటిని కాపాడుకునేందుకు  తిప్పలు పడుతున్నారు. పడిగాపులు కాయలేక కుప్పల మీదనే పలువురు రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా వడ్లు కొంటలేరనే దిగులుతో భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన బేతెల్లి కుమార్ (45 ) మంగళవారం రాత్రి సూసైడ్ ​చేసుకున్నాడు. ఇలాంటి టైమ్​లో ఆఫీసర్లతో రివ్యూ చేసి  కొనుగోళ్లు స్పీడప్​ చేయాల్సిన సివిల్​ సప్లై మినిస్టర్​ గంగుల కమలాకర్​​ పత్తాలేరు.

బెంగళూరు క్యాంపులో బిజీ.. 
మంత్రి గంగుల కమలాకర్‍ ఐదు రోజులుగా బెంగళూరు క్యాంపుకే పరిమితమయ్యారు. శనివారం కరీంనగర్‍ రేకుర్తిలో జరిగిన ఓ  కార్యక్రమానికి హాజరైన ఆయన  అటు నుంచి అటే లోకల్​బాడీస్ ​ప్రజా ప్రతినిధులతో కలిసి బెంగళూరులోని రిసార్ట్స్​కు వెళ్లిపోయారు. కరీంనగర్​   టీఆర్ఎస్​ తరపున ఎల్‍. రమణ, భాను ప్రసాద్‍ బరిలో నిలవగా, మాజీ మేయర్‍ రవీందర్‍సింగ్‍, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‍రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. హైకమాండ్​ ఆదేశాల మేరకు రూలింగ్​ పార్టీ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలనే కసితో ఉన్న మంత్రి..  కరీంనగర్‍, సిరిసిల్లకు చెందిన  కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు,  జడ్పీటీసీలను ప్ర్యతేక బస్సుల్లో  బెంగళూరు తీసుకెళ్లి క్యాంపు నడుపుతున్నారు.  ప్రతిరోజు వారికి కావాల్సిన వసతి ఏర్పాట్లు చూసుకుంటూ, సమీపంలోని టూరిస్ట్​ ప్లేసులు తిప్పుకుంటూ, వాళ్లతో సెల్ఫీలు దిగుతూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు ట్విటర్​లో  పోస్టు చేస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు.