రూ.90 గడియారం కోసం కేసీఆర్‌కు అన్యాయం చేయొద్దు

రూ.90 గడియారం కోసం కేసీఆర్‌కు అన్యాయం చేయొద్దు

కరీంనగర్: దళిత బంధుతో అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయని భావిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్న అన్ని వర్గాలు ఎదగాలన్నది సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. హుజూరాబాద్ నుంచి దళిత బంధు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించడంపై  కరీంనగర్‌లో టీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ చౌక్‌‌లో కేసీఆర్ చిత్రపటానికి మంత్రి గంగుల కమలాకర్ పాలాభిషేకం  చేశారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ.. దళితల అభ్యున్నతిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.  దళిత బంధుతో అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయని భావిస్తున్నామని చెప్పారు. దళిత బంధు స్కీమ్‌తోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నికపై కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

దళితులను ఓట్ల కోసం వాడుకున్నరు

‘స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా దళితులు ఇంకా వెనకబడే ఉన్నారు. ఇంతకాలం  అన్ని పార్టీలు దళితులను ఓట్ల కోసం, రాజకీయాలకు వాడుకున్నాయి. కానీ వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు.  అందుకే నిరుపేద దళితల అకౌంట్లోకి పది లక్షలు రూపాయలు ఇవ్వాలని సీఎం దళిత బంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. ఈ పథకాన్ని రాజకీయ కోణంలో ఆలోచించొద్దు. గతంలో రైతు బంధు కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాం.  అలాంటి గొప్ప పథకాన్ని మళ్లీ హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించాం’ అని కమలాకర్ పేర్కొన్నారు. 

‘90 రూపాయల గడియారానికి ఆశపడి కేసీఆర్‌కు అన్యాయం చేయొద్దు. పాదయాత్ర ఎందుకోసమో ఈటలను నిలదీయండి. గడియారాలు ఇచ్చి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ప్రజలు కోరుకున్న ఎన్నికలు కావు. IAS అధికారులు గ్రామ గ్రామానికి వచ్చి అర్హులైన దళితులకు ‘దళిత బంధు’ చెక్కులు అందిస్తారు. ప్రభుత్వోద్యోగులున్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులు’ అని కమలాకర్ స్పష్టం చేశారు.