బీజేపీ నేతలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్

బీజేపీ నేతలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్

 బీజేపీ విజయ సంకల్ప సభలో ఆ పార్టీ నేతలు చేసిన విమర్శలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన కరీంనగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేవలం కేసీఆర్ ను తిట్టడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయన్నారు. ప్రజల గుండెల్లోంచి వచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కాదు... దమ్ముంటే ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకొవాలని హీతవు పలికారు. ఈ సమావేశాలతో బీసీలకు మేలు జరుగుతుందని ఆ వర్గాలు ఎంతో ఆశపడ్డారు. కానీ మోడీ నిరాశే మిగిల్చారని గంగుల వెల్లడించారు. 

కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖపై బీసీ ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపైనా ప్రకటన చేయలేదు. బీసీలకు బీజేపీ వ్యతిరేకమా? చెప్పాలి. బీసీల కులగణన ఎందుకు చేయడం లేదు అని మంత్రి గంగుల ప్రశ్నించారు. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి వెంటనే బీసీల కులగణన వెంటనే చేపట్టాలన్నారు. తాను లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో 2950 రైస్ మిల్లులు మూత పడ్డాయని అన్నారు. వీటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని మంత్రి విమర్శించారు.

రైసుమిల్లుల్లో 24,400 కోట్ల విలువ చేసే... 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పేరుకు పోయింది. ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోడీ ఎందుకు ప్రకటన చేయలేదు. వానాకాలం సాగు కూడా ప్రారంభమైంది. రైతులు వరిసాగు చేయాలా వద్దా...? అని ప్రశ్నించారు. ఈ అంశాలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు నోరు మెదపలేదు ధ్వజమెత్తారు. బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్రాన్ని ఒక్క పైసా నిధులు ఎందుకు అడుగలేదు అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేకంగా.. బీసీల వ్యతిరేకంగా ప్రధాని మోడీ వ్యవహరించారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.