వడగళ్ల వానల స‌మ‌స్య రాకుండా ముందుగానే పంట వేయాలి

వడగళ్ల వానల స‌మ‌స్య రాకుండా ముందుగానే పంట వేయాలి

క‌రీంన‌గ‌ర్: మనకు అవసరమైన ఆహార పంటలు మనమే పండించుకునేలా సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలన్నారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్. మంగ‌ళ‌వారం ఆయ‌న క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ లో సమగ్ర వ్యవసాయ విధాన ప్రణాళికపై నిర్వ‌హించిన‌ రివ్యూ మీటింగ్ లో మాట్లాడారు. వరి, పత్తి, మొక్కజొన్న లాంటి పంటల సాగుకే పరిమితమైన రైతులకు కొత్త పంట సాగు విధానాలు, లాభాలు వివరించి వారిని ఆ వైపు ప్రోత్సహించాలన్నారు. మన పంటలు మనమే పండించుకోవాలని సీఎం సూచిస్తే.. కొంత మంది రైతు బంధు రద్దు చేస్తున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని.. జిల్లాలోని వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు పూర్తి చేసి, భూసారం ఆధారంగా ఎరువులు, రసాయనాలు వాడేలాగా చూడాలన్నారు.

ఇష్టమొచ్చినట్లు ఎరువులు వాడితే నేల విష పూరితమై సారం కోల్పోయే ప్రమాదముందని పోటాష్, యూరియా, డీఎపీ చాలా చోట్ల అవసరం లేకున్నా వాడుతున్నారని తెలిపారు. చాలా నేలల్లో లవణాలు ఉన్నా… మళ్లీ అదనంగా ఎరువు రూపంలో వేస్తే భూసారం తగ్గుతుందన్నారు. యాసంగిలో గతంలో కంటే మూడు రెట్ల పంట పండిందని.. అయినప్పటికీ అందరి దగ్గర వరి పంట కొంటున్నామ‌ని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఏనాడు 25 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం కొనలేదని.. ఈసారి 70 లక్షల మెట్రిక్ టన్నులు కొనేందుకు సిద్ధమై, ఇప్పటికే 40 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామ‌ని చెప్పారు.

విత్తనాల నుంచి పంటకు గిట్టుబాటు ధర వరకు రైతులకు ఏ ఇబ్బంది రాకూడదన్నదే తెలంగాణ సర్కారు ధ్యేయమని తెలిపారు. రైతులు పంట మార్పిడి విధానాలు పాటించాలని.. దొడ్డు రకం వడ్ల స్థానంలో సన్నరకాలు పండించాలని తెలిపారు. సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో వరి కోతల సమయంలోనే వడగళ్ల వానలు పడుతున్నాయని.. ఈ సమస్య రాకుండా పంటకాలం ముందుకు తెచ్చుకోవాల్సిన అవసం ఉందని తెలిపారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్.