ఏఎన్​ఎం​ల రెగ్యులరైజ్ కుదరదు : మంత్రి హరీశ్‌‌రావు

ఏఎన్​ఎం​ల రెగ్యులరైజ్ కుదరదు : మంత్రి హరీశ్‌‌రావు
  • కాంట్రాక్ట్‌‌ సిబ్బందికి తేల్చి చెప్పిన మంత్రి 
  • ఉద్యోగాల భర్తీలో వెయిటేజీ ఇస్తామని హామీ
  • హైదరాబాద్‌‌లో ఏఎన్‌‌ఎంల మహా సభలో వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: కాంట్రాక్ట్‌‌ బేసిస్‌‌పై పనిచేస్తున్న ఏఎన్‌‌ఎంల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడం కుదరదని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌రావు స్పష్టం చేశారు. రెగ్యులరైజ్‌‌ చేయడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పారు. ఏఎన్‌‌ఎం ఉద్యోగ ఖాళీలు చాలా ఉన్నాయని, త్వరలో వాటిని భర్తీ చేస్తామని, అందుకోసం నిర్వహించే ఎగ్జామ్‌‌లో వెయిటేజీ ఇస్తామని తెలిపారు. ఏడాదికి రెండు మార్కుల చొప్పున వెయిటేజీ ఇవ్వడంతో పాటు ఏజ్ రిలాక్సేషన్‌‌ కూడా ఇస్తామని వెల్లడించారు. రెగ్యులర్ రిక్రూట్‌‌మెంట్‌‌లో అత్యధిక ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఏఎన్‌‌ఎంలకే వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన ఏఎన్‌‌ఎంల రెండో మహా సభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఎన్‌‌ఎంలు, సెకండ్ ఏఎన్‌‌ఎంలు చేస్తున్న సేవలను కొనియాడారు. ఏఎన్‌‌ఎంలు పనిచేస్తున్న సబ్ సెంటర్లను, పల్లె దవాఖాన్లుగా అప్‌‌గ్రేడ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి పల్లె దవాఖానకు ఓ భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఎన్ని మంచి పనులు చేసినా, ఒక్క చెడ్డ పని మొత్తం పేరును చెడగొడుతున్నదని, ఆ ఒక్కటీ జరగకుండా పని చేయాలని సూచించారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌‌ చివరి స్థానంలో ఉందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌‌‌‌తో పేదలకు ఎలాంటి లాభం లేదన్నారు. ఈ విషయాన్ని ఏఎన్‌‌ఎంలు ప్రజలకు వివరించాలని మంత్రి కోరారు.

వెయిటేజీ వద్దు.. రెగ్యులరైజ్ చేయండి..

ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌‌పై ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి తమ ఉద్యోగం రెగ్యులరైజ్ అవుతుందని కాంట్రాక్ట్ ఏఎన్‌‌ఎంలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహా సభకు మంత్రి హరీశ్‌‌రావు హాజరవుతారని, సభకు వెళ్లాలని డీఎంహెచ్‌‌వోల నుంచి ఆదేశాలందడంతో సభకు ఏఎన్‌‌ఎంలు భారీగా హాజరయ్యారు. ఇదే సభలో రెగ్యులరైజేషన్‌‌పై నిర్ణయం ప్రకటిస్తారని ఆశించిన వారికి మంత్రి హరీశ్‌‌ షాక్ ఇచ్చారు. సభలో మంత్రి మాట్లాడుతుండగానే ‘‘వెయిటేజీ కాదు.. రెగ్యులరైజ్ చేయండి’’అంటూ నినాదాలు చేశారు. అలా చేయడం కుదరదని మంత్రి ఖరాఖండిగా చెప్పడంతో నిరాశకు గురయ్యారు. రాష్ట్రంలో 4 వేల మంది కాంట్రాక్ట్ ఏఎన్‌‌ఎంలు పనిచేస్తున్నారు. తమతో అడ్డగోలుగా పని చేయించుకుని, ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరాశగా వెనుదిగారు.