గోదావరి ఎప్పటికీ ఎండిపోదు

గోదావరి ఎప్పటికీ ఎండిపోదు

 

  •    మా ప్రభుత్వం జీవనదిగా మార్చింది: మంత్రి హరీశ్​
  •     కుంభవృష్టి కురిసినా మిషన్​ కాకతీయ వల్ల ఒక్క చెరువు తెగుతలేదు
  •     మూడు, నాలుగేండ్లలో మూసీలోని నీటిని దోసిళ్లతో తాగేలా తీర్చిదిద్దుతం
  •     కేసీఆర్‌‌‌‌ విజన్​తో తలసరి ఆదాయం, జీఎస్డీపీలో రాష్ట్రం టాప్​లో ఉంది
  •     కేంద్రం విధానాలతో ప్రాజెక్టులకు పర్మిషన్లు వస్తలేవని ఆరోపణ
  •    300 కిలో మీటర్లు జీవధారగా మారింది: మంత్రి హరీశ్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది 300 కిలో మీటర్ల మేర జీవధారగా మారిందని, ఇక అది ఎప్పటికీ ఎండిపోయే పరిస్థితే ఉండదని మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. ఖైరతాబాద్​లోని ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్​ ఇంజనీర్స్‌‌లో ఏర్పాటు చేసిన ‘నేషనల్‌‌ కన్వెన్షన్‌‌ ఆన్‌‌ రివర్స్‌‌’ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. వాటర్​ మ్యాన్​ ఆఫ్​ ఇండియా రాజేంద్రసింగ్‌‌ స్ఫూర్తితో తమ ప్రభుత్వం గోదావరిని జీవననదిగా మార్చిందని, ఉమ్మడి ఏపీలో నిర్లక్ష్యానికి గురైన 46 వేల చెరువులను ప్రజల భాగస్వామ్యంతో పునరుద్ధరించిందని చెప్పారు. రాజేంద్రసింగ్‌‌ 2017లో ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలోని నెక్కొండ చెరువుపై బర్త్‌‌డే చేసుకున్నారని గుర్తుచేశారు. గతంలో భారీ వర్షం పడితే చెరువులు తెగి మనుషులు చనిపోయారనే వార్తలు వచ్చేవని, మిషన్‌‌ కాకతీయలో భాగంగా చెరువులు పునరుద్ధరించిన తర్వాత కుంభవృష్టి కురిసినా ఒక్క చెరువూ తెగడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఇరిగేషన్‌‌ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత మూడేండ్లలోనే కాళేశ్వరం లాంటి భారీ లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఎండాకాలంలో కాళేశ్వరం నీళ్లు తెచ్చి హల్దీ, పెద్దవాగు, కూడెళ్లి వాగులను పారించామని చెప్పారు. నదుల కోసం రాజేంద్రసింగ్‌‌ తన జీవితాన్నే అంకితం చేశారని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నదుల పునరుజ్జీవం కోసం పనిచేయాలన్నారు.

మూసీ, గోదావరి లింక్​ చేస్తం
ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువులు పునరుద్ధరించడంతో రాష్ట్ర ఆదాయం పెరిగిందని హరీశ్​ తెలిపారు. కేసీఆర్‌‌ విజనరీ నాయకత్వం కారణంగానే తలసరి ఆదాయం, జీఎస్డీపీ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌‌ వన్‌‌గా ఉందన్నారు. కేంద్రం విధానాలతో ప్రాజెక్టులకు పర్మిషన్లు రావడం లేదని ఆరోపించారు. ఇరిగేషన్‌‌ మంత్రిగా తాను, స్పెషల్‌‌ సీఎస్‌‌, ఈఎన్సీ షిఫ్టుల వారీగా ఢిల్లీలో ఉండి, సీడబ్ల్యూసీలోని అన్ని డైరెక్టరేట్ల చుట్టూ తిరిగి ఏడాదిన్నరలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్మిషన్లు తీసుకువచ్చామన్నారు. మూసీ నది పునరుజ్జీవానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని చెప్పారు. గోదావరితో లింక్‌‌ చేసి రానున్న మూడు, నాలుగేండ్లలో మూసీలోని నీటిని దోసిల్లతో తాగేలా తీర్చిదిద్దుతామన్నారు. నాలుగేండ్ల తర్వాత మూసీ నది కింద రాజేంద్రసింగ్‌‌ బర్త్‌‌ డే వేడుకలు నిర్వహించి ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. ముగింపు సమావేశంలో వి. ప్రకాశ్‌‌, ఇందిరా ఖురానా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పల్స్​ పోలియోను ప్రారంభించిన మంత్రి హరీశ్
పోలియో నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే పోలియో చుక్కలు వేయడం ఒకటే మార్గమని మంత్రి హరీశ్​ రావు అన్నారు.  పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ఇందిరాపార్క్ వద్ద ప్రారంభించారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని, ఈ మూడ్రోజులు పోలియో చుక్కల డ్రైవ్ జరుగుతుందని తెలిపారు. పోలియో చుక్కలు వేయించకుండా నిర్లక్ష్యం చేస్తే పిల్లలు శాశ్వతంగా వికలాంగులుగా మారిపోతారని అన్నారు. మరోవైపు హైదరాబాద్​లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. కాగా, మొత్తం  37,28,334 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశామని హెల్త్ డిపార్ట్​మెంట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

నదుల అనుసంధానానికి మేం వ్యతిరేకం: రాజేంద్రసింగ్​
నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకమని, జాతీయ సదస్సులో దీనిపై చర్చించామని వాటర్‌‌ మ్యాన్​ ఆఫ్‌‌ ఇండియా రాజేంద్రసింగ్‌‌ అన్నారు. ‘నేషనల్‌‌ కన్వెన్షన్‌‌ ఆన్‌‌ రివర్స్‌‌’ ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నదుల పక్షాన పనిచేసేలా ప్రజలను  చైతన్యవంతం చేస్తామన్నారు. ప్రభుత్వాలను వెనుకుండి నడిపిస్తున్న కార్పొరేట్‌‌ శక్తులు నదుల పునరుజ్జీవానికి అడ్డుగా నిలుస్తున్నాయని ఆరోపించారు. తాను న్యాయ పోరాటం చేసి రాజస్థాన్‌‌లో 28 వేల మైనింగ్‌‌ కంపెనీలను మూయించానని, కేంద్రం తలపెట్టిన కెన్‌‌ -బెట్వా రివర్‌‌ లింకింగ్‌‌పైనా పోరాడుతానన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో నదులపై, నీళ్లపై రాష్ట్రాలు హక్కులు కోల్పోతాయని తాను గొంతు చించుకొని అరిచినా ఒక్క సీఎం కూడా స్పందించలేదని, తెలంగాణ, ఏపీ సీఎంలు ఇప్పుడు నదులపై హక్కుల కోసం మాట్లాడుతున్నారని అన్నారు. నేషనల్‌‌ రివర్‌‌ కన్వెన్షన్‌‌లో రివర్‌‌ మేనిఫెస్టోపై 27 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించామని, త్వరలోనే దీనిపై అన్ని రాష్ట్రాల్లో అభిప్రాయ సేకరణ చేపడుతామని పేర్కొన్నారు. మార్చి నెలాఖరు వరకు అభిప్రాయాలు తీసుకొని మేనిఫెస్టో పబ్లిష్‌‌ చేస్తామన్నారు.