ప్రాధాన్యతా క్రమంలో లక్ష రుణమాఫీ.. మంత్రి హరీశ్‌రావు

ప్రాధాన్యతా క్రమంలో లక్ష రుణమాఫీ.. మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, వెలుగు : ప్రాధాన్యతా క్రమంలో  లక్ష రూపాయల రుణాలు మాఫీ చేస్తామని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఇప్పటికే రూ.లక్ష లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేసినట్లు చెప్పారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రుణమాఫీ కింద ఇప్పటి వరకు 18 లక్షల 79 వేల మంది రైతులకు రూ.9,654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు.17 లక్షల 15 వేల మంది ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు చేరాయని తెలిపారు. 

పలు  కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని.. వీరికి కూడా వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. రుణ మాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యువల్‌ పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9654 కోట్లు.. కొత్త లోన్ల రూపంలో మళ్లీ రైతులకు చేరాలని చెప్పారు. దీనిపై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణ మాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు అదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబధిత అన్ని సమస్యలు సత్వరం పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.