చాంతాడంత పెంచి.. మూరెడు తగ్గిస్తరా?

చాంతాడంత పెంచి.. మూరెడు తగ్గిస్తరా?
  • సెస్ ను రూ. 31 నుంచి.. 3.4కి తగ్గించి గొప్పలు చెప్పుకోండి
  • పెట్రోల్ ధరలపై మంత్రి హరీష్ రావు
  • గాంధీలో ఎంఆర్ఐ (MRI) క్యాథ్​ల్యాబ్ ప్రారంభం
  • వైద్య శాఖలో 13 వేల పోస్టులు భర్తి చేస్తున్నామని వెల్లడి

హైదరాబాద్ : పెట్రోల్ ధరలు చాంతాడంత పెంచి, మూరెడు తగ్గిస్తే సంబురపడిపోవడానికి జనాలు అమాయకులు కారని మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. రూపాయి పెంచి, చారాణా తగ్గించి గొప్పలు చెప్పుకుంటోందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి పెట్రోల్‌‌పై రూ.3.40 ఉన్న సెస్‌‌ను ఇప్పుడు రూ.31కి పెంచారు. దమ్ముంటే రూ.3.4కి తగ్గించి గొప్పలు చెప్పుకోవాలి. గ్యాస్ ధరను రూ.400 నుంచి రూ.1,050 చేసి, ఇప్పుడు రూ.200 తగ్గించారు. ఈ తగ్గింపు కూడా పావలా మందికే చేశారు. ఈ జిమ్మిక్కులన్నీ జనాలకు తెలుసు. మా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌‌పై ఒక్క రూపాయి కూడా సెస్ పెంచలేదు. కేంద్రమే పెంచింది కాబట్టి కేంద్రమే తగ్గించాలి” అని హరీశ్ డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ హాస్పిటల్‌‌లో ఎంఆర్‌‌‌‌ఐ మిషన్, క్యాథ్‌ ‌ల్యాబ్‌‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు సర్కార్ దవాఖాన్లంటే చిన్నచూపు ఉండేదని, ఇప్పుడు ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని చెప్పారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తున్నాయన్నారు. డబుల్ ఇంజిన్​ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్‌‌.. వైద్య సేవల్లో చివరి స్థానంలో ఉంటే, తెలంగాణ సర్కార్ దేశంలో మూడో స్థానంలో ఉందన్నారు. వైద్యశాఖలో 13 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

 

గాంధీకి భారీగా నిధులు : -
గాంధీ దవాఖానలో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు రూ.100 కోట్ల నిధులను కేటాయించామని హరీశ్‌‌ తెలిపారు. రూ.13 కోట్లతో లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్, రూ 9 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ్​ల్యాబ్, రూ 2.50 కోట్లతో సీటీ స్కాన్ మిషన్లను ప్రారంభించామని చెప్పారు. మరో రూ 30 కోట్లతో ఆర్గాన్​ ట్రాన్స్​ప్లాంట్ థియేటర్ కాంప్లెక్స్‌‌ను ఏర్పాటు చేస్తున్నామని,  గాంధీ, పేట్లబురుజు, వరంగల్‌‌ ఎంజీఎమ్‌‌లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, టెండర్ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. అంతకుముందు హాస్పిటల్‌‌లోని వార్డులను మంత్రి పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవల్లో లోటుపాట్లను తెలుసుకున్నారు.

ఎట్టకేలకు డైట్ క్యాంటీన్‌‌కు మోక్షం
గాంధీ ఆసుపత్రి పేషెంట్లు, డాక్టర్లకు ఫుడ్డును అందించే డైట్ క్యాంటీన్ కొత్త భవనానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. మంత్రులు హరీశ్‌‌, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలసి డైట్ కిచెన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సెల్లార్‌‌‌‌లో అనేక ఇబ్బందులున్నాయని, అక్కడ కిచెన్ ఉండటం అంత సేఫ్ కాదని  అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించి, కొత్త భవనాన్ని నిర్మిస్తున్నామని హరీశ్‌‌ అన్నారు. కాగా గాంధీ మెయిన్ బిల్డింగ్‌‌ సెల్లార్‌‌‌‌లోని డైట్ క్యాంటీన్ ప్రమాదకరంగా ఉందంటూ ‘వెలుగు’ పత్రికలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ‘డేంజర్‌‌‌‌గా గాంధీ క్యాంటీన్’ శీర్షికన మార్చి 23న ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు.. సెల్లార్‌‌‌‌లో డైట్ క్యాంటీన్ ప్రమాదకరంగా ఉందంటూ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే కొత్త భవనానికి భూమిపూజ జరిగింది.

మరిన్ని వార్తల కోసం : -

ఆల్ ది బెస్ట్.. నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్


ఇవాళ బీజేపీ ఆఫీస్​ బేరర్ల మీటింగ్‌‌