కాంగ్రెస్​ తప్పుడు హామీలతో మోసగిస్తోంది : హరీశ్​రావు

కాంగ్రెస్​ తప్పుడు హామీలతో మోసగిస్తోంది : హరీశ్​రావు

జహీరాబాద్, వెలుగు: కార్నాటకలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలనే కాంగ్రెస్ ఇప్పటికీ నెరవేర్చడం లేదని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. గురువారం నియోజకవర్గంలోని  న్యాల్కల్ మండలం హద్నూర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసగిస్తోందని ఆరోపించారు. 

ఆరు గ్యారంటీలు కాదు అసలు వారికి  గెలిచే గ్యారంటీయే లేదని ఎద్దేవా చేశారు.   కర్ణాటకలో 5 గంటల కరెంటు పొద్దున్న రెండు గంటలు సాయంత్రం మూడు గంటలు ఉంటుందన్నారు. అది కూడా సరిగ్గా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తుందన్నారు.  కేసీఆర్ ప్రభుత్వం వస్తే రైతులకు ఎకరానికి రైతుబంధు రూపంలో రూ.16,000, పింఛన్ రూ. 5000 కు పెంచుతామన్నారు. ఆరోగ్య శ్రీ బీమా రూ.5 లక్షల నుంచిరూ.15 లక్షల వరకు, అసైన్మెంట్ భూములను పట్టాలుగా మారుస్తామన్నారు. 

కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్​రావు,  పార్టీ ఇన్‌చార్జి  దేవి ప్రసాద్, ఎస్సీ చైర్మన్ నరుత్తం ,తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ చైర్మన్ తన్వీర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పార్టీ నాయకులు , కార్యకర్తలు  పాల్గొన్నారు. 

సముచిత స్థానం కల్పిస్తాం

కొండాపూర్: బీజేపీ స్టేట్ నాయకుడు  రాజేశ్వర్‌ రావు దేశ్‌ పాండే ను మినిస్టర్ హరీశ్ రావు మల్లెపల్లిలోని తన ఫాం హౌజ్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజేశ్వర్‌ రావు దేశ్‌ పాండే బీజేపీ నుంచి సంగారెడ్డి  సీటు ఆశించారు. కానీ టికెట్​ ఇచ్చినట్లే ఇచ్చి వేరే అభ్యర్థికి కేటాయించడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు, రాజేశ్వర్‌ రావు దేశ్‌ పాండే ఫాం హౌజ్‌కు చేరుకుని ఆయనను బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. 

ALSO READ: హరీశ్​రావును చూస్తే .. అబద్ధాలు ఆత్మహత్య చేసుకుంటాయ్ : తీన్మార్​ మల్లన్న

పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని  హామీ ఇచ్చి, తన మద్దతు దారులను బీఆర్‌ఎస్‌ లోకి చేర్చుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యేందుకు రాజేశ్వర్‌ రావు దేశ్‌ పాండే ను తన వాహనంలో తీసుకొని హైదరాబాద్​ బయలుదేరారు. ఆయన వెంట బీఆర్ఎస్ సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.