
- ప్రజలు ఆలోచించుకోవాలి
- కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంది కనుకే అభివృద్ధి
- బీఆర్ఎస్లో చేరిన ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ బీఎన్ రావు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు కేసీఆర్‌లాంటి స్ట్రాంగ్ లీడర్ కావాలా.. రాంగ్ లీడర్కావాలా.. ప్రాపర్ లీడర్ కావాలా.. పేపర్లీడర్ కావాలా అనేది అందరూ ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్చేతుల్లో రాష్ట్రం ఉంది కనుకే అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. బందులు, కర్ఫ్యూలు అనేవే లేవన్నారు. శుక్రవారం ఇండియన్ మెడికల్అసోసియేషన్(ఐఎంఏ) స్టేట్ప్రెసిడెంట్ బీఆఎన్రావుతో పాటు పలువురు డాక్టర్లు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డాక్టర్లు బీఆర్ఎస్లో చేరడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాకముందు తీవ్రమైన కరెంట్ కోతలు ఉండేవని, అప్పుడు ఎంబీబీఎస్ చదవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉండేదని, ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్కాలేజీతో స్థానికంగానే వైద్య విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు.
ఎదుటి వాళ్లను తిట్టే వార్తలకే మీడియా ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలకు మంచి చేసే పనులకు పత్రికల్లో పెద్దగా చోటు దక్కడం లేదన్నారు. గతంలో బెంగాల్ఆచరిస్తే దేశం అనుసరిస్తుంది అనే వాళ్లని.. దాన్ని తెలంగాణ తిరగ రాసిందన్నారు. అన్ని రంగాల్లో ఈరోజు తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. రాష్ట్ర గ్రామ పంచాయతీలకు 38 అవార్డులు రావడమే దీనికి నిదర్శనమన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు లాంటి తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. కల్యాణ లక్ష్మితో బాల్య వివాహాలను అరికట్టామన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక సామాజిక కోణం దాగి ఉందన్నారు. కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందని మనిషంటూ ఉన్నారా అని ప్రశ్నించారు. అందుకే రాంగ్ లీడర్ చేతిలో కాకుండా కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ చేతుల్లోనే రాష్ట్రాన్ని పెట్టాలన్నారు. కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేసేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.