కేంద్రం బకాయిపడ్డ పైసలియ్యాలె

కేంద్రం బకాయిపడ్డ పైసలియ్యాలె

నారాయణపేట, వెలుగు : కేంద్రం తెలంగాణకు బకాయి పడ్డ రూ.1100 కోట్లు, జీఎస్టీ కింద రూ.11వేల కోట్లు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌​రావు కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. గత 2 నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలకు రూ.1144 కోట్ల పెండింగ్ ​బిల్లులను చెల్లించామని, మిగితావి రావాల్సి ఉంటే అవి కేంద్ర నిధులేనని, చేతనైతే ఇక్కడి బీజేపీ నేతలు కేంద్రానితో చెప్పి ఇప్పించాలన్నారు. గ్రామపంచాయతీలకు రాష్ట్రం నిధులు ఇవ్వదని చెప్పడం కరెక్ట్​ కాదన్నారు. కర్నాటకలో అప్పర్​భద్ర, ఏపీలో పోలవరం, ఎంపీలో కెన్​ బెత్మా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు –రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వరంగల్​కు కోచ్​ ఫ్యాక్టరీ ఇవ్వాలని పదేపదే కోరుతున్నా ఇవ్వకుండా గుజరాత్​కు కోచ్​ ఫ్యాక్టరీ కేటాయించారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నవి ఒక్కటి కూడా అమలు చేయలేదని, ఏ ముఖం పెట్టుకుని ప్రధాని మోడీ, అమిత్​షాలు తెలంగాణకు వస్తున్నారో చెప్పాలన్నారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.