
ఫొటోలు మధురానుభూతులను మిగులుస్తయ్..
మెదక్‌టౌన్/సంగారెడ్డి టౌన్/సిద్దిపేట రూరల్, వెలుగు : ఫొటోలు జ్ఞాపకాలను చరకాలం గుర్తుండేలా చేస్తాయని, మధురానుభూతులను మిగులుస్తాయని అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డిలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ లో కలెక్టర్ శరత్ కుమార్, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరై ప్రారంభించారు. వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటోగ్రాఫర్ విధినిర్వహణలో వివిధ సందర్భాల్లో తీసిన అత్యుత్తమ ఫొటోలను ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ సందర్భంగా ఫొటో గ్రాఫర్లను సన్మానించారు. మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్స్‌లో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు కార్పొరేషన్ నుంచి కెమెరాలు, వీడియోలు కొనుగోలు చేసేందుకు పూర్తిస్థాయిలో తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఫొటోగ్రాఫర్ల భవనం కోసం స్థలం కేటాయిస్తామన్నారు. సిద్దిపేట పట్టణ శివారులో జిల్లా ఫొటో గ్రాఫర్ సంక్షేమ భవన నిర్మాణానికి కౌన్సిలర్లతో కలసి మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు శంకుస్థాపన చేశారు. భవనం స్థలంతో పాటు రూ.25 లక్షల నిధులను మంత్రి హరీశ్ రావు మంజూరు చేసినట్లు చైర్పర్సన్ తెలిపారు. ఫొటోగ్రాఫర్స్ సిద్దిపేట అభివృద్ధిని దేశానికి చెప్పే విధంగా త్వరలో ఫొటోగ్రాఫర్ల వర్క్ షాప్ నిర్వహిస్తామని సంఘం సభ్యులు తెలిపారు.
చేగుంట తహసీల్దార్ఆఫీస్లో ఏసీబీ తనిఖీలు
మెదక్ (చేగుంట), వెలుగు : చేగుంట తహసీల్దార్ ఆఫీస్‌లో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎకరా 33 గుంటల భూమిని పట్టా పాస్ బుక్ లో నమోదు చేసేందుకు రూ.2.70 లక్షల లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ గురువారం ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ బాబ్ ఆధ్వర్యంలో రెండో రోజు పొద్దంతా తహసీల్దార్ ఆఫీస్‌లో భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
వేర్వేరు చోట్ల ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య
మెదక్ (కొల్చారం)/రామాయంపేట, వెలుగు : మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో గురువారం ఇద్దరు విద్యార్థినులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొల్చారం మండలం పోతంశెట్టి పల్లికి చెందిన చింతల శంకర్, లలిత దంపతుల కుమార్తె ప్రియాంక(21) మెదక్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమె తరచూ కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
- రామాయంపేటలో..
రామాయంపేట పట్టణానికి చెందిన ముత్త రగల్ల సిద్ధరాములు కుమార్తె భవాని(16) స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెంది గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజేశ్ తెలిపారు.
నారాయణ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి
పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్
సిద్దిపేట రూరల్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పాత బస్టాండ్ సెంటర్ లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ రామంతపూర్ లోని నారాయణ విద్యాసంస్థలో విద్యార్థికి టీసీ ఇవ్వకుండా మానసికంగా హింసిస్తే తను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. విద్యార్థులను హత్యలు చేసే ఫ్యాక్టరీ కేంద్రాలుగా నారాయణ విద్యా సంస్థలు తయారయ్యాయని మండిపడ్డారు.
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు బీజేపీ లీడర్లు : మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు : బీజేపీ లీడర్లు తలా, తోక లేకుండా మాట్లాడుతూ అబద్ధాలకు బ్రాండ్ అంబాసీడర్లుగా మారుతున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి పైస రామకృష్ణ వంద మంది అనుచరులతో కలసి హైదరాబాద్ లో హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీ లు నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని తెలిపారు. నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చెస్తే, నేడు స్వరాష్ట్రం లో కేంద్రంలో ని బీజేపీ అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదని పొగడ్తలతో ముంచెత్తిన కేంద్ర మంత్రి షెకావత్ నేడు అవినీతి జరిగిందని మాట్లాడటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించరన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై అందులో భాగస్వామ్యం కావడానికి ఇతర పార్టీలలో నుంచి నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
జిల్లా జైలుగా అప్ గ్రేడ్
సిద్దిపేట సబ్ జైలును జిల్లా జైలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లా జైలుకు 58 మంది సిబ్బందిని కేటాయించినట్టు పేర్కొన్నారు. జిల్లా జైలుకు డిప్యూటీ సూపరింటెండెంట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ తో పాటు ఇద్దరు జైలర్లు, 11 చీఫ్ హెడ్ వార్డర్లు, 29 మంది వార్డర్ల తో పాటు మొత్తం 58 మంది సిబ్బందిని నియమిస్తూ జైళ్ల శాఖ డీజీపీ ఉత్తర్వులు విడుదల చేశారని తెలిపారు.
మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలి
కంది, వెలుగు : మార్కెట్లో ధరలకు అనుకూలంగా హాస్టల్ స్టూడెంట్స్ మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సంగారెడ్డి ఆర్డీవో ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ధర్నా చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నల్లవల్లి రమేశ్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు 2017 లో ఉన్న మెస్ చార్జీలే అమలు చేయడంతో నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, రవి, తేజ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆగస్టులోపు బూస్టర్ డోస్ కంప్లీట్ చేయాలి
కంది, వెలుగు : జిల్లాలో ఈ నెలాఖరులోపు కరోనా నివారణకు సంబంధించిన బూస్టర్ డోస్కంప్లీట్ చేయాలని కలెక్టర్ డాక్టర్శరత్ జిల్లా మెడికల్, హెల్త్ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టేట్లోని మీటింగ్ హాలులో హెల్త్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు బూస్టర్ డోస్ 46 శాతం మాత్రమే పూర్తయ్యిందని, స్పీడప్ చేసి100 శాతం పూర్తి చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ రాజర్షి షా, డీఎంహెచ్‌వో గాయిత్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీకృష్ణాష్టమి
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు గోపికలు, కృష్ణుల వేషధారణ ఆకట్టుకున్నారు. స్కూళ్లలో నిర్వహించిన కార్యక్రమాలు, శోభాయాత్ర, ఉట్టికొట్టే కార్యక్రమాలు అలరించాయి. కోలాటం, హరినామ సంకీర్తనతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. కృష్ణాష్టమి, శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. శ్రీకృష్ణ ఆలయాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
-
వెలుగు, నెట్వర్క్
కొనసాగుతున్న స్వాతంత్ర్య వజ్రోత్సవాలు
స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్ కలెక్టరేట్ ఆవరణలో ఆయా శాఖల మహిళా అధికారులు, సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ రమేశ్ ఈ పోటీలను ప్రారంభించి పరిశీలించారు. కౌడిపల్లి మండలం తునికి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ లోని ఓల్డ్ ఏజ్ హోంలో వృద్ధులకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి, సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని పీహెచ్సీలో రోగులకు ఆఫీసర్లు, లీడర్లు పండ్లు పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో గ్రామ ముస్లింల ఆధ్వర్యంలో జామ మసీద్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకిం పాల్గొన్నారు. - వెలుగు, నెట్వర్క్
చేర్యాలలో అమ్మావరి బండ్లు, బోనాలు
చేర్యాల, వెలుగు : శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం చేర్యాల పట్టణంలో మహంకాళి అమ్మవారి బండ్లు, బోనాలను భక్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతల గుళ్ల చుట్టూ బండ్లను తిప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఏ.స్వరూపారాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్లు చంటి, లింగం, నరేందర్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.