
సిద్దిపేట, వెలుగు:రైతుల బోరు మోటార్లకు మీటర్లు పెడితే రూ.35 వేల కోట్ల ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, రైతులు నష్టపోతరని ఆలోచించిన కేసీఆర్ వద్దని చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలం రామునిపట్లలో కొత్త జీపీ, మహిళా సమాఖ్య, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్, ‘డబుల్’ ఇండ్ల గృహప్రవేశాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ - కాంగ్రెస్ ప్రభుత్వంలో యాసంగిలో ముందు మడి తడిస్తే ఎనుకమడి ఎండేదని, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక చెక్ డ్యామ్స్నిండి ఏడాదికి పక్కాగా రెండు పంటలు పండుతున్నాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సబ్సిడీలను ఎగ్గొడుతూ సామాన్యులపై భారం మోపుతోందని మండిపడ్డారు. అనంతరం కులసంఘాలు, మహిళా సంఘాల భవనాలకు ప్రొసీడింగ్కాపీలు అందజేశారు.
టీఆర్ఎస్ లో చేరిన యువకులు
కాంగ్రెస్, బీజెపీ లకు చెందిన 50 మంది యువకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ కాపీ పేస్ట్ పార్టీ అని తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
బి ఫార్మసీ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన
రామంచలో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న బీ ఫార్మసీ కాలేజీ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే బీ ఫార్మసీ క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. సిద్దిపేట టౌన్లో వేములవాడ కమాన్ వద్ద కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిని కలిసిన మంత్రి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.