
- సర్పంచ్ల పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేస్తం : హరీశ్‌రావు
- కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం తెలియదు
- ఆయన దార్శనికతతో తండాలు జీపీలుగా మారినయ్
- ఎన్నికల తర్వాత మళ్లీ వచ్చేది కారు, కేసీఆరే
- గిరిజన లోకల్ బాడీ ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో మంత్రి వ్యాఖ్యలు
శామీర్‌పేట, వెలుగు : బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే గిరిజనులకు ‘గిరిజన బంధు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గిరిజనుల కోసం ఎన్నో పనులు చేపట్టామని, ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని, మళ్లీ అధికారంలోకి వచ్చేది కారు, కేసీఆరేనని, అన్ని పనులు చేసుకుందామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ స్థానిక సంస్థల గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం శనివారం మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని తూముకుంట ఎ-స్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ లో జరిగింది. ఇందులో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..
గిరిజన తండాల్లో అప్పుడున్న పరిస్థితులను, ఇప్పుడున్న పరిస్థితులకు తేడాను గమనించాలని అన్నారు. ఎన్నో ఏండ్ల నాటి గిరిజనుల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చారని, ఆయన దార్శనికతతో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ గెలిస్తే గిరిజనుల ఆత్మగౌరవం నిలబడ్తుందని, మరో సారి కేసీఆర్ గెలువడం ఎంతో కీలకమని అన్నారు. సేవాలాల్ మహారాజ్, కుమ్రం భీమ్ స్ఫూర్తితో ముందుకు వెళ్దామని సూచించారు.
సర్పంచ్‌లు నారాజ్ కావొద్దు
ఈ ఎన్నికలైన తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ఒక్క రూపాయి కూడా పెండింగ్‌లో లేకుండా విడుదల చేస్తామని, ఎవరూ నారాజ్ కావొద్దని మంత్రి హరీశ్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని, కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం తెలియదని ఆయన అన్నారు. 20 రోజులు కష్టపడితే మనందరి భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు. ‘‘నాడు గిరిజన తండాల్లో విష జ్వరాలు పంజా విసిరితే హైదరాబాద్ నుంచి వైద్య బృందాలు వెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు తండాల్లోనే పల్లె దవాఖానలు ఏర్పాటు చేసుకున్నం” అని అన్నారు.