
ప్రజాప్రతినిధులు రక్తదానంలో భాగస్వాములు కావాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. నేతల పుట్టిన రోజున బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరల్డ్ బ్లడ్ డోనేషన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డిలు రక్తదానంలో కీలక పాత్ర పోషిస్తున్నారని..వారి పుట్టిన రోజుల నాడు పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రక్త దానం చేసినా వ్యక్తులు బలహీనంకారని..దానం చేసిన రక్తాన్ని 24 నుంచి 48 గంటల్లోనే తిరిగి శరీరం ఉత్పత్తి చేస్తుందని వివరించారు. విరివిగా రక్తదానం చేసిన వారిని గుర్తించి సన్మానం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో ఏటా 4 లక్షల యూనిట్ల రక్తం అవసరమైతే 3 లక్షల 7 వేల యూనిట్ల రక్తం మాత్రమే సేకరించగలుగుతున్నామని హరీష్ రావు తెలిపారు. తల్లి రక్తాన్ని ధారపోసి మనకు జన్మనిస్తే..మనం రక్తాన్ని ఇచ్చి మరొకరికి పునర్జన్మను ఇవ్వొచ్చన్నారు. వీలైనంత వరకు ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకు రక్తం ఇవ్వాలన్న మంత్రి ఒక మనిషి 168 సార్లు రక్త దానం చేయవచ్చని తెలిపారు. కేసీఆర్ పుట్టిన రోజున తానే స్వయంగా రక్తదానం చేసినట్లు గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్లడ్ సేపరేటర్లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కొన్ని చోట్ల రక్తాన్ని నిరుపయోగంగా ఉంచుతునట్లు తెలుస్తోందని..రక్తం వృధా కాకుండా సద్వినియోగం అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.