రైతులు కారులో తిరిగే కాలం రావాలె

రైతులు కారులో తిరిగే కాలం రావాలె
  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు: రైతులు కారులో తిరిగే కాలం రావాలన్నది తన కలని, సాకారం అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నంగునూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గులాబీ జెండా నంగునూర్ నుంచే  ప్రారంభించారని, అదే సెంటిమెంట్‌‌తో ఆత్మీయ సమ్మేళనాలకు కూడా ప్రారంభించామన్నారు. బీఆర్ఎస్ అంటే గరిబోళ్ల పార్టీ అని, బీ అంటే  బీదలు, ఆర్ అంటే రైతులు, ఎస్ అంటే సామాన్య మధ్య తరగతి ప్రజలని కొత్త అర్థం చెప్పారు. ఎన్నికల ముందు మాత్రమే కాంగ్రెస్, బీజేపి నేతలు వస్తారని, ఆపదలో తోడుండేది ఎవరో గమనించాలని కోరారు. బీజేపీ సమాధులు తవ్వే ప్రయత్నం చేస్తూ కుల మతాల మధ్య చిచ్చు పెట్టే పెడుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌‌‌‌ సంపద పెంచి పేదలకు పంచితే బీజేపీ పేదల నుంచి పన్నులు గుంజి అదాని, అంబానీలకు పంచి పెడుతోందని విమర్శించారు. పార్టీ కన్నతల్లి లాంటిదని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. చిన్నచిన్న పొరపొచ్చాలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని  కార్యకర్తలకు సూచించారు.

కేసీఆర్‌‌‌‌ నాయకత్వాన్ని దేశ వ్యాప్తంగా బలపరిచేందుకు కార్యకర్తలు సిద్ధం ఉండాలి పిలుపునిచ్చారు. అనంతరం కొద్ది సేపు మంత్రి హరీశ్​ రావు గరిటె పట్టి కార్యకర్తలకు భోజనాలు వడ్డించాడు. అంతకు ముందు నంగునూరు మండలం ఖాతా గ్రామ పెద్దవాగులో  చెక్ డ్యాము వద్ద గంగమ్మకు  జలహారతి పట్టి పూలు, కుంకుమ సమర్పించారు. అలాగే క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో సిద్దిపేట అర్బన్ పరిధిలో 121 మంది, కొండపాక మండలం  విశ్వనాథపల్లి, వెలికట్ట, అంకిరెడ్డిపల్లి గ్రామాలలోని 40 మంది లబ్ధిదారులకు 58, 59 జీవో కింద పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం సిద్దిపేట మున్సిపాలటీ పరిధిలోని 6,7,2 వార్డుల్లో పలు అభివృద్ధి పనులను  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.