తెలంగాణకు ఏం చేశారో చెప్పాలె

తెలంగాణకు ఏం చేశారో చెప్పాలె

బీజేపీ లీడర్లను ప్రశ్నించిన హరీశ్​ 

మెదక్/మెదక్​టౌన్, వెలుగు: ఎవరి ప్రయోజనాల కోసం బీజేపీ లీడర్లు ఉప ఎన్నికలు కావాలంటున్నారని, తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని  రాష్ట్ర మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డితో కలిసి మెదక్ రైల్వే స్టేషన్​లో ఎరువుల రేక్​పాయింట్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు  తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్​ రద్దు చేసిందని, వరంగల్​కు కోచ్​ఫ్యాక్టరీ,  బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ  ఇవ్వలేదని విమర్శించారు.గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసి సిలిండర్ ధర రూ. వెయ్యికి పైగా చేశారని, ఉపాధి కూలీల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోడీ ఉచిత స్కీమ్​లు వద్దంటున్నారని,  పేదలకు ఆసరా పింఛన్లు,  కల్యాణ లక్ష్మి,  ఉచిత కరెంట్, కేసీఆర్​ కిట్ ఇవ్వవద్దా అని ప్రశ్నించారు. ఉప ఎన్నిక వస్తే తెలంగాణాకు  ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తారా, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారా అని నిలదీశారు.  ఉద్యమకాలంలో రాష్ట్రసాధన కోసం పదవులను త్యాగం చేస్తే .. పదవుల యావతో రాజీనామాలు చేస్తున్నారన్నారు. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించాలన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్​లో ఫసల్​ బీమా యోజన అమలు చేయకుండా..  తెలంగాణాలో ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ లీడర్లు అడగడం విడ్డూరంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. గతంలో ఈ స్కీం అమలు చేసినపుడు రాష్ట్రం చెల్లించిన ప్రీమియం కంటే కేంద్రం ఇచ్చిన బీమా చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు.  రైతుల​ మీద ప్రేమ ఉంటే సమగ్ర బీమా పాలసీని తేవాలని డిమాండ్ చేశారు.