నిర్మల మాటలు అబద్ధాలు : మంత్రి హరీష్ రావు

నిర్మల మాటలు అబద్ధాలు : మంత్రి హరీష్ రావు

కేసీఆర్ అసెంబ్లీలో చెప్పింది వంద శాతం నిజం: హరీశ్ రావు
రాష్ట్రానికి రావాల్సిన నిధులెందుకు ఇయ్యట్లే
మెడికల్​ కాలేజీలు ఇవ్వకపోవడం వివక్షేనన్న మంత్రి

గజ్వేల్, వెలుగు : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు పూర్తిగా అబద్ధాలని, ఆమెది బురద జల్లే ప్రయత్నమని రాష్ట్ర మంత్రి హరీశ్​రావు అన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడింది వంద శాతం నిజమని ఆయన అన్ని ఆధారాలు లెక్కలతో వివరించారని చెప్పారు. శుక్రవారం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా గజ్వేల్ లో నిర్వహించిన పలు కార్యక్రమాలలో హరీశ్ పాల్గొన్నారు. తర్వాత గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇండియాను 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేస్తామని ప్రధాని మోడీ ప్రతి మీటింగ్​లో ప్రకటించారు. కానీ ఈ ఎనిమిదేండ్లలో సాధించింది 3.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ మాత్రమే. ఒక్క ఏడాదిలో మిగతా లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమా.. కేసీఆర్ ఇదే విషయం అడిగారు. అందులో జోకు ఏముంది’’ అని హరీశ్ ప్రశ్నించారు. మీరు పెట్టుకున్న లక్ష్యం సరిగ్గా లేదు, సరైన కార్యాచరణ లేదనే  ఆయన అన్నారని తెలిపారు.

అనుమతికి లోబడే అప్పులు చేస్తున్నం

ఎఫ్​ఆర్​బీఎం అనుమతికి లోబడే రాష్ట్రం అప్పులు తీసుకుందని హరీశ్ తెలిపారు. అనుమతి కంటే ఎక్కువ తీసుకుంటే కాగ్ ప్రశ్నించదా అని అన్నారు. కేంద్రంలా రోజువారీ ఖర్చుల కోసం మేం అప్పులు తీసుకొవడం లేదన్నారు. మేం ప్రాజెక్టుల మీద కాపిటల్ ఎక్స్​పెండీచర్​గా పెట్టుకున్నామన్నారు. ‘‘జీఎస్టీ నష్టపరిహారాన్ని గ్రాంట్ రూపంలో ఇవ్వాల్సింది అప్పు రూపంలో తీసుకోమని చెప్పారు. కేంద్రం నుంచి రూ.1.25 లక్షల కోట్లు రావాల్సి ఉంది. అవి ఇప్పించాలని నిర్మలా సీతారామన్ గారిని కోరుతున్నం” అని అన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోమని చెప్పినందుకు రూ.16,653 కోట్లు కోల్పోయామన్నారు. దీంతోపాటు ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ 2021-–2026 ఐదేండ్ల కాలంలో రూ.30 వేల కోట్లు రాష్ట్రానికి రాకుండా పోతాయన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా చెప్పిన స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ రూ.5,374 కోట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఎగ్గొట్టిందన్నారు. విద్యుత్తు వినియోగంపై రూ.3 వేల కోట్లు ఏపీకి ఇవ్వాలని చెప్పిన కేంద్రం.. మనకు ఏపీ నుంచి రావాల్సిన రూ.17,800 కోట్లను ఇప్పించట్లేదని విమర్శించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు చెల్లించలేదన్నారు. పొరపాటున ఏపీ ఖాతాలో వేసిన, తెలంగాణ సొమ్ము రూ.495 కోట్లు ఇప్పించండని ఎన్ని వినతులు సమర్పించినా, లేఖలెన్నో రాసినా, అన్నీ బుట్ట దాఖలే అయ్యాయన్నారు. వాటిని ఇప్పించడంలో నిర్మల చొరవ చూపితే బాగుంటుందన్నారు. ఆయన వెంట ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్​రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు ఉన్నారు.

మిగతా రాష్ట్రాలకు ఇచ్చి మాకెందుకు ఇవ్వలే

రైతుల ఆదాయం రెట్టింపు అన్నరు..పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి పెట్టుబడి ఖర్చు రెట్టింపు చేశారని విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు. ‘‘సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం కింద కేంద్రం మెడికల్ కాలేజీలు ఇస్తామంటే.. కరీంనగర్​, ఖమ్మం జిల్లాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వినతులు పంపింది. అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయనే నెపంతో కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయలేదు. ఆ జిల్లాలు తెలంగాణలో భాగం కాదా, ఎందుకు ఇవ్వరు. మిగతా రాష్ట్రాలకు ఇచ్చి మాకు ఇవ్వకపోవడం వివక్షకు నిదర్శనం కాదా” అని ప్రశ్నించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు కావడం లేదనే ఆరోపణ కూడా పూర్తిగా అబద్ధమన్నారు.