బండారం బయటపడ్తదని బీజేపీకి భయం

బండారం బయటపడ్తదని బీజేపీకి భయం

హైదరాబాద్‌‌, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో తమ బండారం మొత్తం బయట పడుతుందేమోనని బీజేపీకి భయం పట్టుకుందని, అందుకే తాము సిట్ ఏర్పాటు చేస్తే దర్యాప్తు ఆపాలంటూ ఆ పార్టీ నేతలు కోర్టుకు వెళ్లారని మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. గురువారం ప్రగతి భవన్‌‌లో మంత్రి నిరంజన్‌‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల వ్యవహారంలో దొరికిపోయిన బీజేపీ దొంగల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని విమర్శించారు. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్న పరిస్థితి బీజేపీదని ఎద్దేవా చేశారు. నిందితులైన స్వామీజీలు తమకు తెలియనే తెలియదన్న బీజేపీ నేతలు.. తీరా వాళ్లను అరెస్ట్‌‌ చేసి జైలుకు పంపిన తర్వాత విచారణ ఆపాలని కోర్టుల్లో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తడిబట్టలతో ప్రమాణం చేశారని, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టులో కేసులు వేశారని.. మొదట వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుట్రలు బయటపడి ఇజ్జత్‌‌, మానం పోతుందన్న భయంతోనే విచారణ ఆపేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలకు నీతి, నిజాయతీ ఉంటే విచారణకు సహకరించాలన్నారు. 

ఎవరి ఫోన్లు ఎవరు ట్యాప్ చేస్తున్నరు?

ఈ వ్యవహారంలో గవర్నర్‌‌ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని హరీశ్ రావు అన్నారు. ‘‘గవర్నర్‌‌ ఎందుకు తుషార్‌‌ అనే వ్యక్తి గురించి మాట్లాడారు. మేం రాహుల్‌‌ గాంధీపై పోటీ చేసిన తుషార్‌‌ గురించి మాట్లాడితే.. గవర్నర్‌‌ తన మాజీ ఏడీసీ తుషార్‌‌ పేరును ఎందుకు ప్రస్తావించారో తెలియడం లేదు. ఎవరి ఫోన్‌‌లు ఎవరు ట్యాప్‌‌ చేస్తున్నారో దేశ ప్రజలందరికీ తెలుసు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు గౌరవప్రదంగా ఉండాలి. తమ విలువ, స్థాయిని తగ్గించుకునేలా మాట్లాడటం సరికాదు” అని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విచారణ ఆగబోదని, నిజానిజాలు త్వరలోనే బయట పడతాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.