
సీఎం కేసీఆర్ ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌లో సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ్‌ఖేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. జిల్లా చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అని అన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా అని.. సమైక్య రాష్ట్రంలో ఎవరూ దాని గురించి ఆలోచించలేదన్నారు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వ చొరవతో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చిందని అన్నారు. ఇప్పుడు సాగునీరు కూడా రాబోతోందన్నారు. 4000 కోట్ల రూపాయలతో 4 లక్షల ఎకరాలను సాగునీరు అందించే గొప్ప కార్యక్రమానికి సీఎం శంకుస్థాపన చేశారని తెలిపారు. వరద నీరు గోదావరిలో కలవడమే మనకు తెలుసన్న హరీష్ రావు.. సీఎం గోదావరి నీళ్లను వెనక్కి మళ్లించి.. మంజీరాలో కలిపే అద్భుత కార్యక్రమాన్ని చేపట్టారని ప్రశంసించారు. 90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి జలాలను మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ కు, అక్కడ నుంచి సింగూర్ కు, సింగూర్ నుంచి జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌కు అందించబోతున్నారని హరీశ్ రావు చెప్పారు.
కోటి ఎకరాల మాగాణిగా మన తెలంగాణను ఏడేండ్ల కాలంలోనే తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దన్నారు మంత్రి హరీశ్ రావు. గతంలో నారాయణఖేడ్‌లో పనిచేసినప్పుడు ఒక సామెత ఉండేదని..గోరెంచకు పిల్లనియ్యొద్దు.. హద్దునూరుకు ఎద్దును ఇవ్వొద్దు అనే సామెత ఉండేదన్నారు.ఇవాళ మీదయతో మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయి. దీంతో గోరెంచకు నీళ్లు వచ్చాయి. త్వరలో ఈ ప్రాజెక్టులతో హద్దునూరుకు ఎద్దు కూడా ఇస్తారంటూ తెలిపారు. నారాయణ ఖేడ్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న మంత్రి హరీశ్... ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షలు ఇవ్వాలని సీఎంను కోరారు. నిజాంపేటను మండలంగా మార్చాలని అభ్యర్థించారు.
మరిన్ని వార్తల కోసం..