హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ప్రభుత్వ భూములే అతిపెద్ద ఆస్తిగా మారాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 76 వేల ఎకరాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఏకంగా 30,749 హెక్టార్ల (దాదాపు 76 వేల ఎకరాలు) భూమి తక్షణమే అందుబాటులో ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (పీవోఐఏఐటీ) వెల్లడించింది. ఈ మేరకు ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ పేరుతో నివేదిక విడుదల చేసింది.
బిగ్గెస్ట్ ఇన్వెస్ట్ ఏరియాగా ఫ్యూచర్ సిటీ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుకు ఈ భూములే ప్రధాన పెట్టుబడి కానున్నాయి. తాజా నివేదిక ప్రకారం ఫ్యూచర్ సిటీ ప్రాంతం బిగ్గెస్ట్ ఇన్వెస్ట్ ఏరియాగా అవతరించింది. హైదరాబాద్‌కు అత్యంత చేరువలో ప్రభుత్వం చేపట్టిన ఈ ఫ్యూచర్ సిటీ.. భూముల లభ్యతలో గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ఫ్యూచర్ సిటీని కేవలం నివాస ప్రాంతంగా కాకుండా.. ‘వర్క్, లివ్, ప్లే’ కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లు, రోబోటిక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ పరిశ్రమలకు కేటాయించనున్నారు.
ALSO READ : పట్నం బాట పట్టిన ప్రజలు: విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా వాహనాల రద్దీ
ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, స్కిల్స్ యూనివర్సిటీ వంటివి ఇక్కడే వస్తుండటంతో.. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఫ్యూచర్ సిటీ వైపు చూస్తున్నాయి. కాలుష్య కారక పరిశ్రమలకు తావులేకుండా, గ్రీన్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఇక్కడ పెద్దపీట వేస్తుండటం గమనార్హం. కేవలం భూమిని చూపించడమే కాకుండా.. రోడ్లు, నీరు, విద్యుత్ వంటి సదుపాయాలతో ఇన్వెస్టర్లకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తోంది. కేంద్రం పోర్టల్‌లో ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండటంతో విదేశీ కంపెనీలు సులభంగా ఇక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నాయి.
పెట్టుబడులకు రెడ్‌కార్పెట్..
భూముల లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమ పెట్టాలంటే భూసేకరణకే రెండేండ్లు పడుతుంది. కానీ తెలంగాణలో ప్రభుత్వమే లిటిగేషన్లు లేని క్లియర్ టైటిల్ భూములను సిద్ధంగా ఉంచడంతో కంపెనీలు ఎంవోయూ కుదుర్చుకున్న నెల రోజుల్లోనే పనులు ప్రారంభించేందుకు వీలుంది.
ALSO READ : ఇంట్లో పేలిన మరో వాషింగ్ మెషీన్
ఈ ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానమే విదేశీ కంపెనీలను ఆకర్షిస్తోందని ఎక్స్పర్ట్స్చెప్తున్నారు. రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు సిద్ధంగా ఉన్న ఇండస్ట్రియల్ పార్కులను చూపిస్తుండడంతో.. ఇన్వెస్టర్లు వెంటనే నిర్ణయం తీసుకోగలుగుతున్నారని, దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరగకుండా ఉండడంతో పాటు, త్వరగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
