భారత్-అమెరికా మధ్య సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ట్రేడ్ డీల్ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా అమెరికా నుంచి పప్పుధాన్యాల దిగుమతిపై సుంకాల వ్యవహారం ఇరు దేశాల మధ్య కొత్త చిచ్చుకు కారణమవుతోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే పర్సెస్ విషయంలో భారత్ 30 శాతం దిగుమతి సుంకాన్ని విధించడాన్ని అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిని అన్యాయమైన చర్యగా అభివర్ణిస్తూ అమెరికా సెనేటర్లు కెవిన్ క్రామర్, స్టీవ్ డైన్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
గతేడాది అక్టోబర్ 30న అమెరికా నుంచి వచ్చే పప్పు ధాన్యాలపై భారత్ ఈ సుంకాన్ని ప్రకటించి, నవంబర్ 1 నుండి అమలులోకి తెచ్చింది. అయితే భారత్-అమెరికా సంబంధాల్లో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పెద్దగా ప్రచారం చేయకుండా గోప్యంగా ఉంచింది. గతేడాది అమెరికా భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలకు ప్రతిచర్యగానే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలోని నార్త్ డకోటా, మోంటానా వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు పప్పుధాన్యాల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. భారత్ ఈ సుంకాలు విధించడం వల్ల తమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇతర దేశాలతో పోటీ పడలేకపోతున్నారని సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పప్పుధాన్యాల వినియోగంలో భారత్ వాటా దాదాపు 27 శాతంగా ఉంది. ముఖ్యంగా పెసర, శనగ, బఠానీ వంటి పల్సెస్ కి భారత్ అతిపెద్ద మార్కెట్. భారత్‌తో ఎటువంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నా.. ముందుగా అమెరికా పప్పుధాన్యాలకు మెరుగైన మార్కెట్ ప్రవేశం కల్పించేలా చూడాలని ట్రంప్‌ను సెనేటర్లు కోరారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ సుంకాల యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో వాణిజ్య చర్చలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అగ్రరాజ్యం ఒత్తిడికి భారత్ తలొగ్గుతుందా లేక తన పంతం నెగ్గించుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
