ఆరు నెలల్లో 80 వేల ఉద్యోగాలిస్తం : హరీశ్ రావు 

ఆరు నెలల్లో 80 వేల ఉద్యోగాలిస్తం : హరీశ్ రావు 

ఆరునూరైనా భర్తీ చేసి తీరుతాం: హరీశ్ రావు 

సిద్దిపేట, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీని ప్రభుత్వమే గుర్తించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘ఎక్కడ్నో పేపర్ లీకైతే ప్రతిపక్షాలు బయటపెట్టలేదు. ప్రభుత్వమే పేపర్ల లీకేజీని గుర్తించింది. ఈ పని చేసినోళ్లను బొక్కలో వేసి కఠిన చర్యలు తీసుకుంటున్నది” అని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దురదృష్టకరమైన సంఘటన జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులకు అన్యాయం జరగనివ్వబోమని ఆయన చెప్పారు. వెంటనే పరీక్షలు నిర్వహించి, రానున్న ఐదారు నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.

నిరుద్యోగులు ప్రతిపక్షాల వలలో పడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని, మంచిగా చదువుకోవాలని సూచించారు. ‘‘మొత్తం 80 వేల ఉద్యోగాలను ఆరు నెలల్లో భర్తీ చేస్తాం. కొత్త ఉద్యోగాల కోసం బడ్జెట్ లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినం. ఆరునూరైనా 80వేల ఉద్యోగాలు నింపడం ఖాయం. నిరుద్యోగులు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు” అని అన్నారు. ‘‘కాంగ్రెస్, బీజెపీ నేతలకు రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉండదు. తెలంగాణ ఇంటి వాడైన కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలి” అని డిమాండ్ చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కేసీఆర్ పని చేస్తుంటే బీజేపీ నేతలు కూల్చేస్తామనడం తగదన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. కాగా, గర్భిణులకు రెండుసార్లు అందించే న్యూట్రీషన్ కిట్ల పంపిణీని ఈ నెల 16న ప్రారంభిస్తామని తెలిపారు.  

జిల్లాలో మహారాష్ట్ర రైతుల పర్యటన.. 

సిద్దిపేట జిల్లాలో 150 మంది మహారాష్ట్ర రైతులు ఆదివారం పర్యటించారు. గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. మొదట సీఎం  కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, సింగాయపల్లి ఫారెస్ట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మిషన్ భగీరథ పథకాన్ని పరిశీలించారు. అనంతరం దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలంలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్, పంప్ హౌస్ లను చూశారు. సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలంలోని పెద్దవాగు చెక్ డ్యామ్​లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు చెక్ డ్యామ్ ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయని రైతులకు వివరించారు.