డ్రైవర్లు, సిబ్బంది వేతనాలు పెంచుతాం : హరీశ్ రావు

డ్రైవర్లు, సిబ్బంది వేతనాలు పెంచుతాం : హరీశ్ రావు
  • ఆశా వర్కర్ల సెల్​ఫోన్ బిల్లులు ప్రభుత్వమే కడ్తది
  • కొత్తగా ఎంపికైన వారికి స్మార్ట్​ఫోన్​లు ఇస్తామని వెల్లడి
  • 466 వెహికల్స్ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు అంబులెన్స్​లు ఎంతో సహాయపడుతాయని, ఒకేసారి 466 వెహికల్స్ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఘటనా స్థలానికి చేరుకునేందుకు గతంలో 30 నిమిషాల సమయం పట్టేదని, ఇప్పుడు 15 నిమిషాల్లో చేరుకుంటాయని తెలిపారు. ఆరోగ్య శాఖ కొనుగోలు చేసిన అంబులెన్స్​లను మంగళవారం ఉదయం పీపుల్స్ ప్లాజా వద్ద జరిగిన ప్రోగ్రామ్​లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 

అనంతరం మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అమ్మ ఒడి (102) వెహికల్స్ ద్వారా రోజుకు 4వేల మందికి, అంబులెన్స్​ల (108) ద్వారా 2వేల మందికి సేవలు అందుతాయన్నారు. అంబులెన్స్‌‌ డ్రైవర్లు, ఇతర సిబ్బంది వేతనాలను కూడా పెంచుతామని ప్రకటించారు. ఆశా వర్కర్లకు సెల్‌‌ఫోన్ బిల్లును ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని, కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి స్మార్ట్‌‌ ఫోన్లు కొనిస్తామని తెలిపారు.

తల్లి పాల లోగో ఆవిష్కరణ

ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురస్కరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను మంగళవారం మధ్యాహ్నం సెక్రటేరియెట్​లో మంత్రి హరీశ్‌‌ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష గణాంకాల ప్రకారం శిశువుకు తల్లి పాలు అందించడంలో దేశ సగటు 63 శాతం ఉంటే, తెలంగాణ సగటు 68 శాతం ఉందన్నారు. బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమన్నారు. పాలిచ్చే తల్లులకు భవిష్యత్తులో రొమ్ము, అండాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు.

కండ్ల కలక ప్రమాదకరం కాదు

కండ్ల కలక ఇన్ఫెక్షన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వానాకాలంలో వైరల్ ఫీవర్‌‌‌‌లతో పాటుగా సోకే ఈ తరహా ఇన్ ఫెక్షన్లతో ప్రమాదమేమీ ఉండదని డాక్టర్లు చెబుతున్నారని మంత్రి ప్రకటించారు. కండ్ల కలక, ఇతర సీజనల్ వ్యాధులపై మంగళవారం సెక్రటేరియెట్ నుంచి హెల్త్ ఆఫీసర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. కండ్ల కలక సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు, చికిత్స తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 

సరోజినీ దేవి కంటి హాస్పిటల్ ఓపీ టైమ్​ను పొడిగించాలని సూపరింటెండెంట్‌‌ను సూచించారు. గవర్నమెంట్ హాస్పిటల్స్​లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కొనసాగించాలన్నారు. ఇన్ఫెక్షన్లు సోకకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌‌లదే అని స్పష్టం చేశారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్‌‌) పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను ఇంగ్లీష్‌‌తో పాటు తెలుగులోనూ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ప్రస్తుతం ఔట్​సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న వారికి ఫ్రీగా శిక్షణ ఇప్పించాలన్నారు.