ఏటా జాబ్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌తో ఉద్యోగాల భర్తీ

ఏటా జాబ్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌తో ఉద్యోగాల భర్తీ
  • మెరిట్‌‌‌‌కే పట్టం కట్టాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన
  • సిద్దిపేటలో టెట్ ఫ్రీ కోచింగ్‌‌‌‌ను ప్రారంభించిన మంత్రి

సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలో ఏటా జాబ్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు. మెరిట్‌‌‌‌కే పట్టం కట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు. శనివారం సిద్దిపేటలోని టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌లో టెట్ ఉచిత కోచింగ్‌‌‌‌ను ప్రారంభించి మాట్లాడారు. ఏటా రిటైరయ్యే ఉద్యోగుల ఖాళీలను గుర్తించి, వాటి భర్తీ కోసం చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. గ్రూప్ 1, 2 పరీక్షల్లో అవినీతికి ఎలాంటి ఆస్కారం ఇవ్వద్దనే ఉద్దేశంతో ఇంటర్వ్యూలను రద్దు చేయాలనే దిశగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 1.33 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 12 వేల ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉందని, ఇంకో 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ను విడుదల చేస్తామని తెలిపారు. జోనల్ వ్యవస్థ తెచ్చి, అన్ని జిల్లాల్లో సమానంగా ఖాళీలు ఉండేలా చూసి, సీనియర్లకు స్థానికంగా చాన్స్ ఇవ్వడం వల్ల అనేక జిల్లాల్లో ఖాళీలు భర్తీ చేసే అవకాశం వచ్చిందని వివరించారు. ఇందుకోసం 317 జీవో తెస్తే బీజేపీ రాద్ధాంతం చేసిందని ఆరోపించారు. కేవలం స్థానిక యువతకు ఉద్యోగాలు దొరకాలనే ఉద్దేశంతో విమర్శలను పట్టించుకోలేదని, ఇప్పుడు 95% స్థానికులకు ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. కేంద్రంలో 16.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడేండ్లలో ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదని చెప్పారు. 

తలవంచి చదివితే.. తలెత్తి బతకొచ్చు..
కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి తలవంచి చదివితే జీవితాంతం తలెత్తి బతకొచ్చని హరీశ్‌‌‌‌ అన్నారు. శిక్షణ తీసుకున్నోళ్లు ఉద్యోగం సాధించినప్పుడే ఈ శిబిరానికి సార్థకత ఉంటుందని, ఉచిత శిక్షణ శిబిరంలో ఏదీ ఉచితంగా రావడం లేదని, ఉద్యోగార్థులంతా కష్టపడి చదవాలని కోరారు. అన్నీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా కష్టపడి చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు
సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో ఆశావర్కర్లు కీలక పాత్ర వహిస్తున్నారని, కరోనా టైమ్​లో ఆశా వర్కర్లు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారని కొనియాడారు. ప్రతి నెల 3న తాను జూమ్ మీటింగ్ నిర్వహిస్తానని, ఏమైనా సమస్యలుంటే తనకు నేరుగా చెప్పాలని సూచించారు. త్వరలో సిద్దిపేట ఆస్పత్రిలో రేడియో, కీమోథెరపీ, మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు, క్యాథల్యాబ్​లను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించే శాంపిల్ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్ వెహికల్‌‌‌‌కు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు సిద్దిపేట న్యూ హైస్కూల్‌‌‌‌లో డాక్టర్ రాగి గంగారాం సహకారంతో రూ.25 లక్షలతో నిర్మించిన భోజన శాలను, విపంచి ఆడిటోరియంలో నిర్వహించిన జాబ్ మేళా ను, పోలీస్ ఉచిత శిక్షణా శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.