రైతుల ఖాతాల్లో అప్పులు కాదు.. డబ్బులు ఉండాలె 

రైతుల ఖాతాల్లో అప్పులు కాదు.. డబ్బులు ఉండాలె 

సిద్ధిపేట: వ్యవసాయానికి ఓ రూపు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. వ్యవసాయం దశ, దిశను కేసీఆర్ మార్చారని ప్రశంసించారు. సిద్ధిపేటలోని విపంచి కళా నిలయంలో నియోజకవర్గ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. ఆయనతోపాటు జెడ్పీ చైర్మన్ రోజా శర్మ కూడా ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడటం రైతుల పాలిట వరం అన్నారు. 

‘రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎరువులు, విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద, కాలిపోయే ట్రాన్స్‌‌ఫార్మర్‌ లాంటివి నిత్యకృత్యంగా ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం రైతు ఆత్మహత్యలు జరుగుతుండేవి. కానీ తెలంగాణ వచ్చాక అన్నీ మారిపోయాయి. రాష్ట్రానికి కేసీఆర్ కొత్త రూపును ఇచ్చారు. రాష్ట్రంలో నేటికి 7,300 కోట్ల రైతు బంధు నిధులను విడుదల చేశాం. గతంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కంకులు పట్టుకొని వచ్చేవారు. కానీ ఇప్పుడు విత్తనం పెట్టకముందే రైతుల అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నాం. తెలంలగాణలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల భూమిలో ధాన్యం పండింది. భూమి మీద రైతుకు రూ.5 లక్షల బీమా ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. వెక్కిరించే వాళ్లే నేడు అసూయ పడుతున్నారు. రైతులను పామాయిల్ పంటల వైపు మళ్లించాలి. రైతులకు బ్యాంకుల్లో అప్పులు కాకుండా నిల్వలు ఉన్నప్పుడే వారి జీవితాలకు సార్థకత చేకూరుతుంది. ఆత్మ కమిటీ మంచి ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నాం’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.