కేసీఆర్‎ను విమర్శించే హక్కు శివరాజ్ సింగ్‎కు లేదు

కేసీఆర్‎ను విమర్శించే హక్కు శివరాజ్ సింగ్‎కు లేదు

సిద్దిపేట: తెరాసాను, సీఎం కేసీఆర్‎ను విమర్శించే నైతిక హక్కు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‎కు లేదని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌహాన్ మాటలు వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉందని హరీశ్ ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన రైతుబంధు వేడుకలలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారు‌. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉంది. సీఎం కేసీఆర్‎ను విమర్శించే నైతిక హక్కు నీకు‌ లేదు. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని‌ సీఎం అయ్యావు. నాలుగేళ్లు సీఎంగా ఉండి ఏం సాధించావు? తెలంగాణతో‌ మీ రాష్ట్రం దేనికి పోలిక? ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించింది? మీరా అవినీతి గురించి మాట్లాడేది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు‌ సమాధానంగా  మీ కేంద్రమంత్రి  పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి  జరగలేదని స్పష్టంగా చెప్పారు‌. మరి మీ మధ్యప్రదేశ్‎లో వెలుగుచూసిన వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి? ఎవరికైనా శిక్ష పడిందా? మనుషులనే మీరు చంపేశారు. మీ కుటుంబ‌సభ్యులకు, మీ పార్టీ నేతలకు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. 317 జీవో రద్దు చేయాలా? అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా? స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ‌రావాలని సీఎం భావిస్తుంటే.. ఉద్యోగాలు రావద్దని బీజేపీ కుట్ర చేస్తోంది’ అని హరీశ్ ఆరోపించారు.