అంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు : మంత్రి హరీష్ రావు

అంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు : మంత్రి హరీష్ రావు

అంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని  చేపట్టామని మంత్రి హరీష్ రావు తెలిపారు. అమీర్ పేట్ లోని వివేకానంద కమ్యూనిటీ హాల్ లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడారు. రెండో విడత కంటి వెలుగు 100  రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. సిటీలో 115 చోట్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. నిన్న ఖమ్మం వేదికగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి వెల్లడించారు.

గతంలో 827 ఉండే కంటి వెలుగు బృందాలు.. ఇప్పుడు 1500 లకు పెంచామని హరీష్ రావు చెప్పారు. నగరంలోని గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ లు కాలనీల్లోనే కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ట్వీటర్ లో ట్వీట్ చేస్తే మీ దగ్గరకే వచ్చి కంటి పరీక్షలు చేస్తారన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజల దగ్గరికి ప్రభుత్వం వస్తోందని.. తెలంగాణ ఏం చేస్తే దేశం అదే అనుసరిస్తుందని వెల్లడించారు. దేశానికి దిస్కూచిలా తెలంగాణ ఉందని..కేసీఆర్ తెలంగాణ ప్రతిష్ట, గౌరవం పెంచడంతో పాటు ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు. పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు మన కార్యక్రమాలను మేచుకొన్నారని తెలిపారు. కంటి చూపుతో బాధపడే వారి జీవితంలో ఈ కార్యక్రమం వెలుగు నింపుతుందని పేర్కొన్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమైయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు. దీని కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 16,556 చోట్ల అధికారులు శిబిరాలను ఏర్పాటు చేశారు. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా అన్నిరోజుల్లో కంటి పరీక్షలు చేస్తారు.