డీహెచ్ ఆఫీసులో మానిటరింగ్‌‌ హబ్‌‌ ప్రారంభించిన మంత్రి హరీశ్‌‌రావు

డీహెచ్ ఆఫీసులో మానిటరింగ్‌‌ హబ్‌‌ ప్రారంభించిన మంత్రి హరీశ్‌‌రావు
  • త్వరలో 1,569 పల్లె దవాఖాన్లు 
  • స్టాఫ్ నర్సుల రిక్రూట్‌‌మెంట్‌‌కు నోటిఫికేషన్ 

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ (పీహెచ్‌‌సీ)లలో సీసీ కెమెరాలతో పర్యవేక్షణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌‌లో ఏర్పాటు చేసిన పీహెచ్‌‌సీల మానిటరింగ్‌‌ హబ్‌‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌రావు శుక్రవారం ప్రారంభించారు. హబ్‌‌ నుంచే రాష్ట్రంలోని వివిధ పీహెచ్‌‌సీలలో ఉన్న డాక్టర్లతో, పేషెంట్లతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 870 పీహెచ్‌‌సీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పీహెచ్‌‌సీలో 4 కెమెరాలు ఉంటాయన్నారు. వీటిలో ఒకటి ఓపీ రూమ్‌‌లో, ఇంకొకటి ఫార్మసీలో, మరొకటి ల్యాబులో, ఇంకొకటి వెయిటింగ్‌‌ హాల్‌‌లో ఉంటాయని చెప్పారు. వీటి ద్వారా పీహెచ్‌‌సీలలో ఏంజరుగుతోందో హబ్‌‌ నుంచే నిరంతరం మానిటర్ చేయొచ్చన్నారు. హెల్త్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ ఎండీ తదితర ఉన్నతాధికారుల ఆఫీసులకు ఈ సీసీ కెమెరాలను లింక్ చేశామని తెలిపారు. పీహెచ్‌‌సీలలో ఉన్న డాక్టర్లు, పేషెంట్లతో ఆఫీసర్లు ఎనీటైమ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి సూచనలు ఇవ్వొచ్చన్నారు. తన పీహెచ్‌‌సీలోని ఫార్మసీ, ల్యాబ్, హాల్‌‌లో ఏంజరుగుతోందో పర్యవేక్షించేలా డాక్టర్ల రూమ్‌‌లో కూడా ఒక మానిటర్ ఉంటుందన్నారు. అన్నింటికీ మించి డాక్టర్లకు, పేషెంట్లకు సెక్యూరిటీ ఉంటుందన్నారు. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం దేశంలోనే ఇదే మొదటిసారి అని మంత్రి తెలిపారు. 

త్వరలో స్టాఫ్‌‌ నర్సుల రిక్రూట్‌‌మెంట్

రాష్ట్రవ్యాప్తంగా 1,569 పల్లె దవాఖాన్లను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. వీటిలో మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల రిక్రూట్‌‌మెంట్ పూర్తవగానే పల్లె దవాఖాన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. పీహెచ్​సీల్లో 969 డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ 10 రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఆ వెంటనే స్టాఫ్ నర్స్‌‌, స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ప్రస్తుతం 331 బస్తీ దవాఖాన్లు ఉన్నాయని, మరో 270 ఏర్పాటు చేస్తామన్నారు.తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాది మరో 9 కాలేజీలు పెడతామన్నారు. వీటికి కేంద్రం ఆర్థిక సాయం చేస్తానంటే, ఇప్పటికైనా దరఖాస్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి చొరవ తీసుకుంటానంటే, తానే వెళ్లి దరఖాస్తులు ఇస్తానన్నారు. గాంధీ దవాఖాన డాక్టర్లు రూపొందించిన ‘హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మ్యానువల్‌‌’ను మంత్రి ప్రారంభించారు. 

పేట్ల బురుజు హాస్పిటల్ అభివృద్ధికి రూ. కోటి ఇచ్చిన సంతోష్

హైదరాబాద్ లోని పేట్ల బురుజు ఆస్పత్రి అభివృద్ధికి ఎంపీ జోగినపల్లి సంతోష్ తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. కోటి కేటాయించారు. ఎంపీ నిర్ణయం పట్ల హరీష్ రావు వర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు. ఈ నిధులతో ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామని, అన్ని సౌలతులు కల్పిస్తామని తెలిపారు. సంతోష్ పేట్ల బురుజు ఆస్పత్రిలో పుట్టారని చెప్పారు. ఆయనను స్పూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించినోళ్లు వాటి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హరీష్ పిలుపునిచ్చారు.