మునుగోడులో ఇంటింటికి నీరొస్తున్నాయి: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

మునుగోడులో ఇంటింటికి నీరొస్తున్నాయి: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

నిర్మల్,వెలుగు: మిషన్​భగీరథపై ఆఫీసర్లు నిర్లక్ష్యం వీడాలని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సీరియస్​అయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం సక్సెస్​అయ్యిందని.. నిర్మల్ జిల్లాలో ఎందుకు సాధ్యం కావడంలేదని ప్రశ్నించారు. శుక్కవారం నిర్మల్​జిల్లా పరిషత్​సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్​పర్సన్​ కొరిపల్లి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఆఫీసర్ల తీరుపై మండిపడ్డారు. పైప్ లైన్ పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడం.. చేసిన పనుల్లో క్వాలిటీ లేకపోవడం.. ప్రతీ ఇంటికి నల్లా బిగింపు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పెషల్​రివ్యూ మీటింగ్​నిర్వహించాలని భగీరథ ఆఫీసర్లను ఆదేశించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఇటీవల వరద ముంపునకు గురైన 56 గ్రామాల్లో భగీరథ పనులు ఇంకా మొదలు కాలేదని ఎమ్మెల్యే రేఖానాయక్​ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ గ్రామానికి ఫిల్టర్​బెడ్​నిర్మించాలని నిబంధన ఉన్నా... పట్టించుకోవడంలేదన్నారు. ఆర్టీసీ ఆఫీసర్లు మహిళా సిబ్బందికి ఈ డ్యూటీ.. ఆ డ్యూటీ అంటూ వేధించడం మానుకోవాలని మంత్రి హెచ్చరించారు. డిపో మేనేజర్​సాయన్న తీరు మార్చుకోవాలన్నారు. ఇక్కడ డ్యూటీ చేయడం ఇష్టం లేకపోతే వేరేచోటికి బదిలీ చేసుకోవాలన్నారు. నిర్మల్ మెటర్నటీ హాస్పిటల్ లో  కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జడ్పీటీసీలు జీవన్​రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. త్వరలో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి హాజరుకాకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. భైంసా జడ్పీటీసీ మాట్లాడుతూ ఇప్పటివరకు హాస్పిటళ్లలో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయలేదన్నారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని జడ్పీటీసీ ఓస రాజేశ్వర్​ కోరారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ​అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. 

ఆదిలాబాద్ ​జడ్పీ మీటింగ్​ వాయిదా

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఆదిలాబాద్​జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​ వాయిదా పడింది. శుక్రవారం జడ్పీ చైర్మన్​రాథోడ్​జనార్దన్​ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి ఆశించిన స్థాయిలో సభ్యులు హాజరుకాలేదు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్​ ప్రకటించారు. 

అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం...  
మండల పరిషత్​, జిల్లా పరిషత్​ సమావేశాలకు సంబంధిత అధికారులు గైర్హాజరవుతున్నారని ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్​రావు, దుర్గం చిన్నయ్య,  పలువురు సభ్యులు మండిపడ్డారు. డ్యూటీలో ఉండి కూడా మీటింగులకు రాని ఆఫీసర్లకు షోకాజ్​ నోటీసులు ఇవ్వడమే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ భారతి హోళికేరి జిల్లా అధికారులను ఆదేశించారు.

భగీరథకు అవార్డులొచ్చినా పల్లెల్లో నీళ్లొస్తలేవ్​ 

మంచిర్యాల,వెలుగు:మిషన్​ భగీరథ స్కీంకు కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చినప్పటికీ పల్లెల్లో నీళ్లు మాత్రం రావట్లేదని జడ్పీ సమావేశంలో సభ్యులు నిలదీశారు. తమ మండలాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. జడ్పీ చైర్​పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్​ నిర్వహించారు. మిషన్​ భగీరథ పైపులైన్లు తరచూ లీక్​ అవుతున్నాయని, రిపేర్ల కోసం రోడ్లను తవ్వి ధ్వంసం చేస్తున్నారని లక్సెట్టిపేట జడ్పీటీసీ సభ్యుడు ముత్తె సత్తయ్య, జడ్పీ వైస్​ చైర్మన్​ తొంగల సత్యనారాయణ మండిపడ్డారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్​)ను గోదావరి ఒడ్డున కట్టడంతో వరదల్లో మునిగిందన్నారు. ముంపు ప్రాంతమని తెలిసినా అనాలోచిత నిర్ణయాలతో రూ.18 కోట్ల నిధులు వృథా చేశారని సత్తయ్య విమర్శించారు. ప్రాణహిత వరదలతో వేమనపల్లి మండలంలో వేల ఎకరాల్లో పత్తి చేలు నీటమునిగి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆ మండల జడ్పీటీసీ డిమాండ్​ చేశారు. పింఛన్లు అర్హులైన పేదలకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారని, ఒక కుటుంబంలో ఒక్కరికే మంజూరు చేస్తున్నారని జడ్పీటీసీ సత్తయ్య, దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్​తో పాటు పలువురు సభ్యులు డీఆర్డీఏ పీడీ శేషాద్రిని నిలదీశారు. బీడీ కార్మికులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఉన్న కుటుంబంలో ఇద్దరికి కూడా శాంక్షన్​ చేస్తామని కలెక్టర్​ బదులిచ్చారు. బతుకమ్మ చీరలు మహిళలందరికీ అందలేదని, అధికారులేమో చీరలు మిగియాని చెప్తున్నారని సత్తయ్య తెలిపారు.