ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్,వెలుగు: విద్యార్థులు పోటీతత్వం పెంచుకోవాలని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెప్పారు. తమలో దాగి ఉన్న సృజనాత్మకతకు పదునుపెట్టాలని, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలన్నారు. గురువారం స్థానిక సెయింట్ థామస్ స్కూల్​లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్​ఫెయిర్​ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రం ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే విద్యార్థులు అనేక రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారన్నారు. ప్రతిభగల స్టూడెంట్లను గుర్తించి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మన ఊరు.. మన బడి’ ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయన్నారు. పేద, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇంగ్లిష్​మీడియం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్టెంత్​పెరుగుతుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమలో జడ్పీ చైర్​పర్సన్​కొరిపల్లి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్​రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, డీఈవో రవీందర్ రెడ్డి, పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్​తదితర సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

ఇంగ్లీష్ అసెస్మెంట్ బుక్ రిలీజ్​...

ఇంగ్లిష్​ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) రూపొందించిన ఫార్మేటివ్​అసెస్మెంట్​రూల్స్ బుక్ ను సైన్స్​ఫెయిర్​వేదికపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రిలీజ్​చేశారు. ఎల్టా జిల్లా బాధ్యులు కడార్ల రవీందర్, వేణుగోపాల్, మల్లయ్య, మనోహర్ రెడ్డి, దత్తాత్రి, గంగాధర్, రామ్మోహన్ తదితరులను మంత్రి అభినందించారు. 

బెల్లంపల్లిలో...

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి బాలికల గురుకులంలో నిర్వహించిన జోనల్​స్థాయి సైన్స్​ఫెయిర్​ను గురువారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆర్​సీవో కొప్పుల స్వరూప రాణి ప్రారంభించారు. శాస్త్రీయ దృక్పథంతో అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్​బత్తుల సుదర్శన్, ఏఆర్సీవో కోటి చింతల మహేశ్వరరావు, కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్, మంచిర్యాల, ఆసిఫాబాద్​జిల్లాల డీసీవోలు రామాల బాలభాస్కర్,  పోలు బాలరాజు,  ప్రిన్సిపాళ్లు ఎస్.స్వరూప, ఐనాల సైదులు, ప్రేమరాణి, రమేశ్​బాబు, రాజమణి, ఊటూరి సంతోష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కోర్సులపై దృష్టి పెట్టాలి: కలెక్టర్​

నిర్మల్,వెలుగు: విద్యార్థులు స్వయం ఉపాధి కోర్సులపై దృష్టిపెట్టాలని కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ సూచించారు. గురువారం స్థానిక రాజీవ్ గాంధీ ఐటీఐ కాలేజీలో సిల్వర్ జూబ్లీ బ్లాక్ ను కలెక్టర్ ప్రారంభించారు. ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ ల్యాబ్, హార్టికల్చర్ ల్యాబ్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లాంటి కోర్సులతో ఉపాధి అవకాశాలు ఎక్కువన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ చదివే వారు కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో రాజీవ్​గాంధీ ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్​ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

దుకాణాల్లో ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసర్ల తనిఖీ

ఆసిఫాబాద్,వెలుగు: ఆసిఫాబాద్​బస్టాండ్ లోని దుకాణాలను గురువారం ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని మూడు షాపులకు జరిమానా విధించారు. తనిఖీలో ఆర్టీసీ ఆఫీసర్లు రవీందర్, దామోదర్​, రమణ, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, కానిస్టేబుల్ తిరుపతి , విశ్వనాథ్, మధుసూదన్, ప్రకాష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి కేటాయించిన షాపులను వారే నిర్వహించాలని, నిబంధనలమేరకే సామగ్రి అమ్మాలని వారు హెచ్చరించారు. 

కేకే-5 బొగ్గు గనిపై కార్మికుల ధర్నా

మందమర్రి,వెలుగు: మందమర్రి ఏరియా కేకే-5 బొగ్గు గనిపై క్యాంటీన్​ మూసివేయడాన్ని నిరసిస్తూ  గని కార్మికులు ధర్నా నిర్వహించారు. గురువారం మొదటిషిప్టు విధుల కాలంలో గని ఆవరణలోని క్యాంటీన్​ మూసి ఉండటంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గని మేనేజర్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజిలెన్స్​, గని యాజమాన్యానికి  వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  డ్యూటీలకు వెళ్లకుండా సుమారు రెండు గంటల పాటు  బైఠాయించారు. నిరసనలో కార్మిక సంఘాల జేఏసీ  లీడర్లు పాల్గొన్నారు.  

జాగ విషయంలో గొడవ యువకుడి దారుణ హత్య

లక్ష్మణచాంద,వెలుగు: ఇంటికి జాగ వదలడం విషయంలో జరిగిన గొడవ యువకుడి హత్యకు దారితీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. లక్ష్మణచాంద మండలం పార్ పెల్లి  గ్రామానికి చెందిన శివరాత్రి మహేశ్ (32) ఇంటి వెనుక కుంచెపు సాయన్న ఇల్లు ఉంది. ఆయన తన ఇంటి దారికోసం గతంలో స్థానిక వీడీసీని సంప్రదించగా వారు మహేశ్ తో మాట్లాడి తొవ్వ చూపించినట్లు తెలిసింది. అయితే జాగ వదిలినందుకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంతో మహేశ్​తాను వదిలిన జాగకు ఇటీవల కంచె ఏర్పాటు చేసుకున్నాడు. కంచె తన స్థలంలోకి వచ్చిందని సాయన్న గురువారం సాయంత్రం మహేశ్​తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కుంచెపు సాయన్న, ఆయన కొడుకులు కుంచెపు వెంకటరమణ , కుంచెపు చింటు ముగ్గురు కలిసి మహేశ్ పై దాడిచేశారు. దీంతో ఆయన కిందపడి అక్కడిక్కడే చనిపోయాడు. డీఎస్పీ జీవన్​రెడ్డి, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై రాహుల్ గైక్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం

నిర్మల్​/భైంసా,వెలుగు: రాష్ట్రాన్ని పాలిస్తున్న అవినీతి సర్కార్​ను గద్దె దించుతామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రజాసంగ్రామ ఇన్​చార్జి గంగిడి మనోహర్ రెడ్డి చెప్పారు. అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. డబుల్​ ఇంజిన్​సర్కార్​రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. గురువారం నిర్మల్​లో మీడియాతో మాట్లాడారు. ప్రజాసంగ్రామ యాత్రా సహా ప్రముఖ్​ వీరేందర్ గౌడ్​తో కలిసి భైంసాలో నిర్వహించనున్న బహిరంగ సభాస్థలాన్ని పరిశీలించారు. టీఆర్ఎస్​సర్కార్, కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదనే విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​చేపట్టనున్న ప్రజాసంగ్రామ యాత్ర నాలుగు జిల్లాలు, ఎనిమిది  అసెంబ్లీ నియోజకవర్గాలు కలుపుతూ మొత్తం 240 కిలో మీటర్ల మేర సాగనుందన్నారు. ఈ నెల 28న భైంసాలో ప్రారంభమయ్యే యాత్ర వచ్చే నెల 17న కరీంనగర్​లో ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్​, ఉమ్మడి జిల్లా పార్టీ లీడర్లు అల్జాపూర్​ శ్రీనివాస్​, రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, నిర్మల్​ జిల్లా సహా ఇన్​చార్జి మ్యాన మహేశ్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, సీనియర్ లీడర్ రామారావు పటేల్, నారాయణ్​ రెడ్డి, గోపాల్​సార్డా, రవి పాండే, ఓంప్రకాశ్​లడ్డా, భోజారెడ్డి, రాజేశ్వర్​రెడ్డి, తాలోడ్​శ్రీనివాస్, మల్లేశ్వర్​ తదితరులు పాల్గొన్నారు.
 

రెండు ఓట్ల పద్ధతి కొనసాగించాలి

మందమర్రి,వెలుగు: సింగరేణి ఎన్నికల్లో రెండు ఓట్ల పద్ధతిని కొనసాగించాలని సీఐటీయూ స్టేట్ ప్రెసిడెంట్​తుమ్మల రాజిరెడ్డి కోరారు. గురువారం కేకే5 గనిపై ఏర్పాటు చేసి గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఒక్క ఓటు పద్ధతితో కార్మికులు మోసపోతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేట్​పరం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు సీఐటీయూలో చేరారు. కార్యక్రమంలో యూనియన్​ ప్రెసిడెంట్​ఎస్.వెంకటస్వామి, సెక్రటరీ అల్లి రాజేందర్, స్టేట్​ లీడర్ రామగిరి రామస్వామి, పిట్ సెక్రటరీలు బేతి భరత్, సంకె వెంకటేశ్, ఐలయ్య, బాలాజీ, సంజీవ్, ప్రవీన్  పాల్గొన్నారు.

చేతబడి చేశాడని దాడి

లక్ష్మణచాంద(మామడ),వెలుగు: చేతబడి చేస్తున్నారనే అనుమానంతో మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన మేకల గంగాధర్, జక్కల మల్లయ్యపై అదే గ్రామానికి చెందిన మల్లయ్య, దొంతుల రవి, రంజిత్, రాజేశ్వర్, గణేశ్, సాయేందర్, వినోద్, రాజశేఖర్, రాఘవేంద్ర, చింటు, మహేందర్​కట్టెలతో దాడిచేశారని ఎస్సై అశోక్​ తెలిపారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్​చెప్పారు.

ఘనంగా సాయిహారతి


నిర్మల్,వెలుగు: స్థానిక గండి రామన్న సాయిబాబా ఆలయంలో గురువారం సాయిహారతి ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ సింగిల్ ట్రస్టీ లక్కాడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముత్యం సంతోష్ గుప్తా, సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

బంగారుగూడ సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగూడ కాలనీ వాసుల సమస్య పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ గురువారం కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముట్టడించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు సాజిద్​ ఖాన్​మాట్లాడుతూ కాలనీ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా.. మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని ఫైర్​ అయ్యారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో రోజుకోతీరు నిరసనలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, పట్టణ అధ్యక్షుడు గుడిపెళ్లి నగేశ్​, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు రంగినేని శాంతన్​రావు, అఫ్రోజ్ ఖాన్, రాజు యాదవ్, అర్ఫద్​ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ ​స్టేషన్​ తనిఖీ

జైపూర్,వెలుగు: జైపూర్​ పోలీస్​ స్టేషన్​ను గురువారం ఇన్​చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. రికార్డులు, 5ఎస్​ విధానం అమలును పరిశీలించారు. పెండింగ్ కేసులు, క్రైమ్​వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, పాత నేరస్తులపై నిఘా పెంచాలని డీసీపీ ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్  డ్రైవింగ్ చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. డీసీపీ వెంట ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్సై రామకృష్ణ, ఏఎస్సై గంగరాజు గౌడ్  తదితరులు ఉన్నారు.

ప్రజల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్, హమాలీవాడలలోని సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే జోగు రామన్న విఫలమయ్యారని జడ్పీ మాజీ చైర్​పర్సన్, బీజేపీ లీడర్​సుహాసిని రెడ్డి ఆరోపించారు. గురువారం ఆమె పట్టణంలోని కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేవన్నారు. ప్రభుత్వం పేదలకు ఎలాగూ డబుల్ బెడ్ రూమ్​ఇండ్లు ఇవ్వడంలేదని, కసీనం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన టాయిలెట్స్​అయినా నిర్మించి ఇవ్వాలని డిమాండ్​చేశారు. 

రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు

భైంసా, వెలుగు: గవర్నమెంట్​ఏరియా హాస్పిటల్​లో రోగులు, బంధువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. 150 బెడ్​ల సామర్థ్యంగల హాస్పిటల్​ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బిల్డింగ్​మరమ్మతు కోసం రూ. 85 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. గైనాకాలజిస్టు నియామకానికి కృషిచేస్తామన్నారు. సమావేశంలో డీసీహెచ్ దేవేందర్ రెడ్డి, ఎంపీపీ కల్పన జాదవ్, సూపరింటెండెంట్​ డాక్టర్​కాశీనాథ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కిశోర్ పటేల్, లీడర్లు భీంరావు పటేల్, చంద్రకాంత్​ యాదవ్, గణేశ్​జాదవ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇండ్ల పట్టాల పంపిణీ

నస్పూర్, వెలుగు: నస్పూర్​మున్సిపాలిటీ పరిధిలోని పలువార్డుల్లోని పేదలకు గురువారం ఎమ్మెల్యే దివాకర్​రావు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏళ్లతరబడి సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, ఏఎంసీ చైర్మన్ పల్లే భూమేశ్, కౌన్సిలర్లు, టీబీజీకేఎస్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు పనులు ప్రారంభం

నార్నూర్,వెలుగు: మండలంలోని మల్కుగూడా, మల్లంగి, మలేపూర్ గ్రామాలను కలుపుతూ రూ. 1.40 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను గురువారం జడ్పీ చైర్మన్​జనార్దన్​రాథోడ్​ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తోందన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకారంతో రోడ్డు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, ఎంపీటీసీ రేణుక దిలీప్, లీడర్లు కనక ప్రభాకర్, హన్మంతరావు రాథోడ్, రామేశ్వర్  తదితరులు ఉన్నారు.

‘భగీరథ’ పనులు త్వరగా కంప్లీట్​చేయాలి

లక్ష్మణచాంద,వెలుగు: మిషన్​భగీరథ పనులు త్వరగా కంప్లీట్​చేయాలని ఎంపీపీ అడ్వాల పద్మా రమేశ్​ కోరారు. గురువారం ఎంపీపీ  అధ్యక్షతన పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, భగీరథ డీఈ, ఏఈలతో రివ్యూ నిర్వహించారు. మురికి కాల్వల్లో వేసిన పైప్​లైన్లను తొలగించాలన్నారు. లీకేజీలు సరిచేసి నల్లా కనెక్షన్లు త్వరగా ఇవ్వాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, ఎంపీడీవో శేఖర్, ఎంపీవో నసీరొద్దీన్, డీఈ హరీశ్, ఏఈ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో  సీపీఐ పోటీచేస్తుంది

మందమర్రి,వెలుగు: వచ్చే శాసనసభ ఎన్నికల్లో సీపీఐ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని జిల్లా సీపీఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్​ తెలిపారు. గురువారం మందమర్రిలోని ఏఐటీయూసీ యూనియన్​ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో  పార్టీ టౌన్​సెక్రటరీ కామెర దుర్గారాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాధుని సుదర్శనం, మిట్టపెల్లి శ్రీనివాస్​, సమితి మెంబర్ సలెంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సాదాసీదాగా మండల సమావేశం

ముథోల్,వెలుగు: ముథోల్​మండల సమావేశం గురువారం సాదాసీదాగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్​ఖాన్  మాట్లాడారు. పరస్పర సహకారంతోనే మండల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రతీ ఒక్కరు కృషిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్​ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మొత్తం 42 వెంచర్లకు పర్మిషన్​లేదని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో సురేశ్​బాబు, ముథోల్ సర్పంచ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే అభివృద్ధి

తిర్యాణి, వెలుగు: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఐటీడీఏ ఉట్నూర్ చైర్మన్ కనక లక్కేరావు చెప్పారు. గురువారం గిన్నెధరి, సుంగాపూర్, పంగిడి మాదార రెసిడెన్షియల్​స్కూళ్లను ఆయన సందర్శించారు. స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్, పౌష్టికాహారం అందించడం కోసమే జిల్లాలో అక్షర జ్యోతి ప్రారంభించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో వందరోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. పాఠశాలల్లోని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ డైరెక్టర్ ఆత్రం లక్ష్మణ్, టీచర్లు దేవరావు, యాదవ్ రావు, కృష్ణారావు ఉన్నారు.