ప్రజలు విద్వేషపూరిత రాజకీయాలను తిప్పికొట్టాలి

ప్రజలు విద్వేషపూరిత రాజకీయాలను తిప్పికొట్టాలి

హైదరాబాద్: బీజేపీ హైద‌రాబాద్‌‌‌లో చిచ్చుపెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. ఇలాంటి విద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. బంజారాహిల్స్‌‌‌లో రాజ్య‌స‌భ స‌భ్యుడు కె.కేశ‌వ‌రావు ఇంట్లో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌‌తో క‌లసి ఇంద్ర‌క‌ర‌ణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌‌కు 100 సీట్లు రావ‌డం ఖాయమని ఇంద్రకరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ప్ర‌జ‌ల‌కు ఏం చేశారు? ఏం చేస్తారోననేది చెప్ప‌కుండా మ‌తం పేరుతో వారిని విడ‌గొట్టడానికి బీజేపీ యత్నిస్తోంది. ప్రశాంతంగా జీవిస్తున్న నగర ప్రజలను చిందరవందర చేసే కుట్రకు పాల్పడటం బీజేపీకి తగదు. హైద‌రాబాద్‌‌పై స‌ర్జిక‌ల్ స్ట్రయిక్స్ చేస్తామని బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు సరికావు. హైద‌రాబాద్ ఏమైనా పాకిస్తానా? లేక‌ అఫ్గానిస్తాన్‌‌లో ఉందా? దేశ అంత‌ర్భాగంపైనే దాడులు చేస్తారా? ప్రజలను రెచ్చగొట్టి, భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. అభివృద్ధిపై మాట్లాడి ఓట్లు అడ‌గాలి. హైద‌రాబాద్‌‌‌లో గ‌తంలో పోలింగ్ శాతం త‌క్కువ‌గా నమోదైంది. ప‌ట్ట‌ణ, గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల మాదిరిగానే న‌గ‌ర ఓట‌ర్లు పెద్ద ఎత్తున ఓటు హ‌క్కును వినియోగించుకోవాలి’ అని ఇంద్రకరణ్ పేర్కొన్నారు.