బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

మోటార్లకు మీటర్లు పెడతామని, రావలసిన రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. ఉచిత విద్యుత్, మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో కేంద్ర బీజేపీ దొంగాట ఆడుతోందని ఆయన ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని అసెంబ్లీలోనే చెప్పామన్నారు. దమ్ముంటే బండి సంజయ్ చెప్పే మాటలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పాలని సవాల్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే రుణాలు ఎక్కువిస్తామని కేంద్రం చెప్పలేదా అని ప్రశ్నించారు. బండి సంజయ్ అజ్ఞానంతో అబద్దాలు మాట్లాడుతున్నాడని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ కోతలపై మాట్లాడని వారు..తెలంగాణపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఫైర్ అయ్యారు.

విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విదేశీ బొగ్గు అంటగడుతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. యూనిట్ విద్యుత్ ను 50 రూపాయలకు అమ్ముకోమనడం ప్రజలపై కక్ష్య సాధించడమే అన్నారు. అదానీ సంస్థలకు లాభం చేకూర్చడం కోసమే విదేశీ బొగ్గు నిబంధన తెచ్చారని విమర్శించారు. మెడపై కత్తి పెట్టి విదేశీ బొగ్గు అంటగట్టడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ఏం చేసినా దేశభక్తి అవుతుందనుకుంటే పొరపాటే అన్న మంత్రి..తెలంగాణకు రావలసిన 30 వేల కోట్ల రుణం ఎందుకు ఆపారో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.బండి సంజయ్ నిజమైన ఎంపీ అయితే తెలంగాణకు రావలసిన రుణాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలన్నారు. దేశ ప్రజలకు కళ్ళకు గంతల్లీ కట్టి బీజేపీ పాలన సాగిస్తుందని వ్యాఖ్యానించారు. మోడీ కుట్రలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని.. దేశ ప్రజలు సరైన సమయంలో బీజేపీకి బుద్ధి చెబుతారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.