మోడీ సర్కారు దేశాన్ని చీకట్లోకి నెట్టింది

మోడీ సర్కారు దేశాన్ని చీకట్లోకి నెట్టింది

ప్రత్యేక ఎజెండా అంటేనే బీజేపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర చలన చిత్రాభివృద్ది సంస్థ నూతనంగా నియమితులైన చైర్మన్ అనిల్ కుర్మాచలం ఆదివారం మాసాబ్ ట్యాంకులోని ఎఫ్ డి సి కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మోడీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక ఎజెండా అంటేనే బీజేపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి ప్రయాణం అంటేనే హస్తినకు వణుకు మొదలైందన్నారు. అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో మోడీ దండు హైదరాబాద్ కు బయలు దేరారని మంత్రి ఎద్దేవా చేశారు. దేశప్రజల ఆకాంక్షలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా తెలుసని అన్నారు. ఎక్కడ వ్యక్తీకరించాలో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అన్నారు. మోడీ సర్కార్ దేశాన్ని చీకట్లోకి నెట్టిందని మంత్రి దుయ్యబట్టారు. దేశంలో వెలుగులు నింపడం ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యం అని పేర్కొన్నారు. 

టీఆర్ఎస్ పార్టీలో సీనియారిటీకి, సిన్సియారిటీకి తప్పక గుర్తింపు ఉంటుందని మంత్రి చెప్పారు. కుర్మాచలం, సతీశ్ రెడ్డిల నియామకం అందులో భాగమే అన్నారు. ఉద్యమ కాలంలో అనిల్ కుర్మాచలం లండన్ లో పోషించిన పాత్ర అద్భుతమని అని మంత్రి కొనియాడారు. సీమాంధ్ర పాలకులు ఉద్యమ కాలంలో విదేశాలకు వెళ్ళాలి అంటేనే వణికిపోయే వారని వ్యాఖ్యానించారు. ఎన్నారైలు విదేశాలలో జరిపిన పోరాటాలు తెలంగాణ సమాజంలో చైతన్యాన్ని నింపాయని మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.