సైనికుల త్యాగం గుర్తించలేని గొప్ప దేశ భక్తులు విపక్ష నాయకులు

సైనికుల త్యాగం గుర్తించలేని గొప్ప దేశ భక్తులు విపక్ష నాయకులు

మునుగోడు ఉపఎన్నిక సర్వేల్లో బీజేపీ మూడో స్థానంలో ఉందని త్వరలోనే తేలుతుందని మంత్రి జగదీష్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఉండదు, ముందస్తు ఎన్నికలు వస్తాయన్న రాజగోపాల్ ఇటీవల చేసిన కామెంట్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మునుగోడులో ఎన్నిక పెట్టె ధైర్యం లేని వారు రాష్ట్రంలో ఎన్నికలు గురించి మాట్లాడటం హాస్యాస్పదమని సెటైర్ వేశారు. రాజీనామా అనంతరమే ఉప ఎన్నికలు అన్న వాళ్ళు ఓటమి భయంతో వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు. ఒక్క నియోజకవర్గంలోనే ఎన్నికలు ఎదుర్కోలేని వాళ్ళు ముందస్తు గురించి మాట్లాడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. దేశం కోసం పని చేసే సైనికులను, రైతులను ఆదుకుంటే విమర్శించడం విపక్షాల హ్రాస్వ దృష్టికి నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. సరిహద్దులను కాపాడే సైనిక జవాన్ల త్యాగం, గొప్పతనం గుర్తించలేని గొప్ప దేశ భక్తులు విపక్ష నాయకులని మంత్రి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి పలు కామెంట్స్ చేశారు. మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని భావించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తన రాజీనామా తర్వాతే కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ఈ క్రమంలోనే ఎన్నడూ లేనివిధంగా మునుగోడుకు వరాల జల్లు కురిపిస్తున్నారని తెలిపారు. కానీ కేసీఆర్ బూటకపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.