గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేసినా లబ్ధిదారులకు రూ.10 వేల సాయం కంటే ఎక్కువ ఇవ్వలేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఒకసారి లబ్ధిపొందిన వ్యక్తికి మళ్లీ 10 ఏళ్ల వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చేవి కావన్నారు. కృష్ణ జలాలు పక్కనుండే పోతున్నా తమ ప్రాంతానికి నీళ్లు వచ్చిన పాపాన పోలేదన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి పారుతున్న సాగునీటిని ఆంధ్రప్రదేశ్ కు పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మేళ్ళచెరువులో బీసీ కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి అందించారు.
తెలంగాణ ప్రజలు నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మిస్తే..ఎక్కడో ఉన్న ఆంధ్ర వాళ్లు వచ్చి నీళ్లు తీసుకెళ్లారని ఆరోపించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పుడు మాత్రం చివరి ప్రాంతాలకు గోదావరి నీళ్లను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని చెప్పారు. ఇతర దేశాలలో లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఘనత కేసీఆర్ దే అన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సైతం గోదావరి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతాన్ని బంగారు తెలంగాణగా కేసీఆర్ తీర్చిదిద్దారని చెప్పారు.