ఎమ్మెల్యేలు, లీడర్లకు మంత్రి జగదీశ్​రెడ్డి దిశానిర్దేశం

ఎమ్మెల్యేలు, లీడర్లకు మంత్రి జగదీశ్​రెడ్డి దిశానిర్దేశం
  • ప్రతి లబ్దిదారుడి ఇంటికి వెళ్లాలి.. స్కీమ్​ల గురించి చెప్పాలని సూచన

నల్గొండ, వెలుగు : ‘ ఏమీ లేని ప్రతిపక్ష లీడర్లు ఎగిరెగిరి పడుతుంటే ..  ఎంతో చేసిన మనం వెనకబడ్డాం.. ఇక ప్రచారంలో  స్పీడ్​ పెంచాలని టీఆర్​ఎస్​ లీడర్లకు మునుగోడు ఎన్నికల ఇన్​చార్జి, మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. శుక్రవారం చండూర్ లో నియోజకవర్గ ఎంపీపీ లు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులతో రివ్యూ చేశారు. ఈ సమావేశానికి ఇన్​చార్జి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఒక్కో మండలంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. సీఎం సభ తర్వాత పార్టీ ఇన్​చార్జి లెవరూ నియోజకవర్గం వైపు కన్నెత్తి  చూడలేదు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే,  బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు లో ప్రచారంలో వేగం పెంచారు. ఆయన చొరవతో చౌటప్పుల్, చండూర్, నాంపల్లి మండలాల్లో పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు బీజేపీ లో చేరారు.  ఈ వలసలను అరికట్టక పోతే టీఆర్​ఎస్​ మరింత దెబ్బ తింటుందని భావించిన రూలింగ్ పార్టీ నేతలు శుక్రవారం చండూర్ లో మీటింగ్ పెట్టారు.  బీజేపీ లోకి వలసలను అరికట్టడం, మునుగోడు ఎన్నికలకు సంబంధించి స్ట్రాటజీ గురించి చర్చించారు. మునుగోడు లో ప్రభుత్వ పథకాల లబ్దిదారులు దాదాపు 2 లక్షల మందిఉన్నారని, వారందరికీ ప్రభుత్వ స్కీమ్​ల గురించి వివరించడంలోనూ,  పెండింగ్ లో ఉన్న  సమస్యలను కూడా పరిష్కరిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఎమ్మెల్యేలు, లీడర్లు విఫలమయ్యారన్న వాదన వినిపించింది. ఎలాంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయని ప్రతిపక్ష  లీడర్లు ప్రజల్లోకి వెళ్తుండగా, టీఆర్​ఎస్​ సైలెంట్ గా ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు ఇక నుంచి పూర్తి స్థాయిలో మునుగోడు పైనే ఫోకస్ పెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. 

నేటి నుంచి మండలాల వారీగా మీటింగ్ లు..

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం శనివారం నుంచి మండలాల వారీగా పార్టీ నాయకులతో మీటింగ్ లు పెట్టాలని మంత్రి చెప్పారు. ఎంపీపీ లు, జడ్పీటీసీ లు,సర్పంచ్ లు గ్రామాల్లో ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేయాలన్నారు. సీఎం సభ ఇన్​చార్జి లు గా ఉన్న  ఎమ్మెల్యేలకే  బాధ్యతలు కట్టబెట్టారు. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాలు అందజేస్తామని, ప్రతి ఇంటి గడప తొక్కి ఎన్నికల్లో పార్టీ గెలుపు కు కృషి చేయాలని చెప్పారు. ఇతర పార్టీ ల్లోకి వలసలు అరికట్టే బాధ్యత కూడా ఎమ్మెల్యేల పైనే పెట్టారు. గ్రూప్ తగాదాలు లేకుండా నేతలను సమన్వయం చేయాలని, మండల మీటింగ్ లు కాగానే గ్రామాల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ఇన్​చార్జి, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు