లండన్​ పర్యటనకు మంత్రి జూపల్లి

లండన్​ పర్యటనకు మంత్రి జూపల్లి
  • 5 నుంచి 7 వరకు వరల్డ్​ ట్రావెల్​ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సోమ‌వారం ఉద‌యం లండ‌న్  ప‌ర్యట‌న‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయ‌డం, ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌డం, ప‌ర్యాట‌క రంగంలో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా జూపల్లి ఇంగ్లాండ్ పర్యటన కొనసాగనున్నది. ఇందులో భాగంగా జూపల్లి లండన్ లో  ఈ నెల 5-7 వ‌ర‌కు మూడు రోజులపాటు జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో పాల్గొంటారు. 

రాష్ట్రంలోని అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర,  వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసేలా ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో  తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ స్టాల్ ను ఏర్పాటు చేయ‌నున్నది. ఆయా దేశాల ప‌ర్యాట‌క శాఖ మంత్రులు, విదేశీ ప్రతినిధులు, గ్లోబల్ టూరిజం బోర్డులు, హోటళ్ల యజమానులు, ప్రయాణ, ఆతిథ్యరంగ నిపుణల‌తో మంత్రి జూప‌ల్లి భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప‌ర్యాట‌క, ఆతిథ్యరంగంలో పెట్టుబ‌డుల అనుకూల‌త‌లపై చ‌ర్చించ‌నున్నారు.  

లండ‌న్ లోని కాసిల్ గ్రీన్ లో నిర్వహించే తెలంగాణ ప‌ర్యాట‌క రోడ్ షోలోనూ జూప‌ల్లి పాల్గొంటారు. కాగా, ఈ ట్రావెట్ మార్ట్ లో 100కుపైగా విదేశీ ప్రతినిధులు, కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గజేందర్​సింగ్​ షెకావ‌త్ తోపాటు ఆయా రాష్ట్రాల ప‌ర్యాట‌క శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన‌నున్నారు.