
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆసిఫాబాద్జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేతలు కలిశారు. జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు, మెడికల్ కాలేజీకి లక్ష్మణ్ బాపూజీ పేరును సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారని, కానీ ఇప్పటివరకు బోర్డు ఏర్పాటు చేయలేదన్నారు.
వెంటనే నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి తన సొంత నిధులతో లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీకి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు సూచించారు. పద్మశాలి సేవా సంఘం పట్టణ అధ్యక్షుడు అనుమల శ్రీకాంత్, కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షుడు గుండా శ్యామ్, నాయకులు ప్రకాశ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కారించాలని మంత్రికి వినతి
జైనూర్, వెలుగు: జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాల్లో రోడ్లు వేయాలని, ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం మార్లవాయిలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్, నాయకులు మెస్రం అంబాజీరావు, జలీమ్ షా కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు.
జైనూర్ పీహెచ్సీని సీహెచ్సీగా మార్చి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉట్నూర్ నుంచి ఆసిఫాబాద్ వరకు రోడ్డును బాగుచేయాలన్నారు. మారుమూల గ్రామాల్లో కనెక్టవిటీ రోడ్డులు మంజూరు చేయాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.