తప్పులన్నీ మీరు చేసి మాపై బురద జల్లుతారా?.. దమ్ముంటే వాటాలపై చర్చకు రా.. దేనికైనా సిద్ధం

 తప్పులన్నీ మీరు చేసి మాపై బురద జల్లుతారా?.. దమ్ముంటే వాటాలపై చర్చకు రా.. దేనికైనా సిద్ధం
  • హరీశ్ రావుకు మంత్రి జూపల్లి సవాల్
  • రాష్ట్రాన్ని తాగుబోతులమయం చేసింది మీరే
  • వాటాల పంపిణీ సహించలేకే బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చినట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉండి చేయాల్సిన తప్పులన్నీ చేసి.. ఇప్పుడు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ తీరు చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుందని మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. మైక్రో బ్రూవరీల అనుమతులపై హరీశ్ రావు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. రవీంద్రభారతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను, పెండింగ్ బిల్లుల వివరాలు వెల్లడిస్తున్నాం. హరీశ్ రావుకు దమ్ముంటే వాటాల పంపిణీపై బహిరంగ చర్చకు రావాలి.

మేం కొత్తగా ఎలాంటి చట్టం తేలేదు. గతంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయి. 2015, ఆగస్టు 28న జీవో నంబర్ 151 జారీ చేసి రూల్స్ ఫ్రేం చేసింది మీరు కాదా? ఆ జీవో ప్రకారం 2016, జూలై 1న మెమో నంబర్ 24367 ఇస్తూ 20 బ్రూవరీలకు అనుమతిచ్చారు. అప్పట్లో 50 దరఖాస్తులు వస్తే.. ఎలాంటి లాటరీ పద్ధతి పాటించకుండా వారికి నచ్చిన 20 మందికి మాత్రమే అనుమతులిచ్చారు. మా ప్రభుత్వంలో మైక్రో బ్రూవరీలకు సంబంధించి ఇప్పటివరకు అనుమతుల కోసం నా వద్దకు ఒక్క ఫైలు కూడా రాలేదు. కేవలం సంబంధిత శాఖకు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కొత్తగా దరఖాస్తులు వస్తే.. భూ లభ్యత, మౌలిక వసతులపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇస్తేనే నిర్ణయం తీసుకుంటాం’’అని జూపల్లి స్పష్టం చేశారు. 

ఎక్సైజ్ బకాయిలకు కారణం మీరే..

బకాయిల చెల్లింపులపై హరీశ్ రావు చేసిన కామెంట్లను జూపల్లి తిప్పికొట్టారు. ప్రతి 15 రోజులకు బకాయిలు చెల్లిస్తే.. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో రూ.3,500 కోట్లు ఎందుకు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడ్డాయని ప్రశ్నించారు. ‘‘కేవలం ఎక్సైజ్ మాత్రమే కాదు.. ఆర్థిక శాఖలో ఇతర పనులకు సంబంధించి రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. అప్పుడు మీరు బిల్లులన్నీ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టి ఇప్పుడు మాపై అరుస్తారా? సింగూరు జలాలను బీర్ల కంపెనీలకు తరలిస్తున్నారన్న ఆరోపణలను ఖండిస్తున్న.

మేము కొత్తగా పైప్ లైన్లు వేయలేదు. అవేవీ కొత్త అనుమతులు కావు. మీ ప్రభుత్వంలో ఉన్నవే. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ ఆదాయం కేవలం రూ.10,012 కోట్లు ఉంటే.. మీ తొమ్మిదేళ్ల పాలనలో దాన్ని రూ. 34,869 కోట్లకు పెంచారు. అంటే ఏకంగా రూ.25 వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకున్నారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది ఎవరో ఇది చూస్తే తెలిసిపోతుంది’’అని జూపల్లి అన్నారు. గతంలో 105 ఎలైట్ బార్లకు ఎలాంటి లాటరీ లేకుండా నచ్చిన వారికి అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా? అని జూపల్లి  ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే...

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే హరీశ్ రావు ఆరోపణలు చేస్తున్నారని జూపల్లి కృష్ణా రావు అన్నారు. ‘‘మీ దోపిడీ, దౌర్జన్యాలు, కాసుల కక్కుర్తి, వాటాల పంపిణీ చూసి సహించలేకే నేను ఆనాడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాను. నీకంత నాకింత అన్నట్లు వ్యవహరించింది మీరు కాదా? మీ బాగోతంపై, వాటాలపై చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? గతంలో మీరు ఎలా ఉండే.. ఇప్పుడు మీ ఆస్తులెంత అనేది అందరికీ తెలుసు. నిజాయితీగా పనిచేస్తున్న నాపై వ్యక్తిత్వ హననం చేయడం తగదు. నేను చెప్పింది అబద్ధమైతే దేనికైనా సిద్ధం’’ అని జూపల్లి సవాల్ విసిరారు.