- జూబ్లీహిల్స్, స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం అపోహలు సృష్టిస్తున్నరు
- వేలకోట్లు దోచుకున్నోళ్లు మా సీఎంను వేలెత్తి చూపిస్తరా?
- ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఫైళ్ల విషయంలో తీవ్ర జాప్యం చేశారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: అవినీతి, దోపిడికీ బీఆర్‌ఎస్ కేరాఫ్ అడ్రస్ అని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శిం చారు. ఈ రోజు లిక్కర్ అంటేనే వారి పేటెంట్‌గా మారిపోయిందని అన్నారు. జుబ్లీహిల్స్ బైపోల్, రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేం దుకు ప్రజల్లో అపోహలు సృష్టించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ‘‘మీరు తలకిందులుగా తపస్సు చేసినా.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచే సమ స్య లేదు” అని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన అవాస్తవ ఆరోపణలపై తప్పనిసరిగా కోర్టులో పరువు నష్టం దావా ఫైల్ చేస్తానని స్పష్టం చేశారు.
గురువారం కేబినెట్ భేటీ అనంతరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుండదని చెప్తలేను. కానీ, ఈరోజు మీ పరిస్థితి ఏంది? తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరెలా ఉన్నరు? లక్ష రూపాయల కారుకు డబ్బులు కట్టలేక అమ్ముకున్న పరిస్థితి మీది. నేడు అడ్డంగా దోచుకొని ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిన్రు. అలాంటి మీరు మీరు నన్ను, మా సీఎంను వేలెత్తి చూపిస్తరా?” అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు.
తాను గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ మంత్రివర్గాల్లో పనిచేశానని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నానని, ఏ రోజూ తనపై ఒక్క ఆరోపణ కూడా రాలేదన్నారు. అమరవీరుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే.. రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్పగా మార్చారని.. మళ్లీ ఇప్పుడు నీతులు చెబుతున్నారని బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. ‘‘శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా’’ అమరవీరుల త్యాగాలను వాడుకున్నారని అన్నారు.
లిక్కర్ స్కామ్‌లో సొంత చెల్లె ఇరుక్కుంటే.. దాని నుంచి బయటపడేందుకు బీఆర్‌ఎస్‌ను తాకట్టు పెట్టి బీజేపీ కాళ్లపై మోకరిల్లిన విషయం మరిచిపోయారా? అంటూ కేటీఆర్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో, పద్ధతి ప్రకారం పనిచేస్తుంటే అభినందించాల్సింది పోయి, రాజకీయ లబ్ధి కోసం బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రిజ్వీ తీరుతో ప్రభుత్వానికి నష్టం
ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ కీలక ఫైళ్ల విషయంలో జాప్యం చేస్తూ, నిర్లక్ష్యం వహించారని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక నష్టం జరిగిందని జూపల్లి అన్నారు. ఈ విషయమై గతంలోనే సీఎంవోకు, సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. లిక్కర్ బాటిళ్లపై వాడే హోలోగ్రామ్స్ కాంట్రాక్టు విషయంలో రిజ్వీ చేసిన జాప్యాన్ని మంత్రి వివరించారు.
ఈ హోలోగ్రామ్స్ కాంట్రాక్టును 2013 ఆగస్టులో ఒక కంపెనీకి కేటాయించారని, 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా 2019 వరకు అదే కంపెనీకి కొనసాగించిందని తెలిపారు. అయితే, 2019లో కాంట్రాక్టు గడువు ముగిసినా.. కొత్తగా టెండర్లు పిలవకుండా 2023 వరకు యేటా నామినేషన్ పద్ధతిలోనే పొడిగిస్తూ వచ్చారని అన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 నెలలకే అధికారుల సమీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించానని తెలిపారు.
ప్రపంచంలోనే ఉత్తమ టెక్నాలజీని గుర్తించి, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) ద్వారా టెండర్లు పిలవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. దీని కోసం ప్రిన్సిపల్ సెక్రెటరీని చైర్మన్‌గా నియమించి కమిటీ వేశామని, అయినా ఆయన జాప్యం చేశారని ఆరోపించారు. దీనిపై స్పందన లేకపోవడంతో 2024 ఆగస్టు 13 నుంచి డిసెంబర్ 9 వరకు వరుసగా 5 సార్లు రిమైండర్లు పంపినట్టు ఆధారాలతో సహా చూపించారు.
డిస్టిలరీ ఫ్యాక్టరీల విషయంలోనూ..
డిస్టిలరీ ఫ్యాక్టరీలకు సంబంధించిన మరో అంశంలోనూ అధికారులు జాప్యం చేశారని మంత్రి వెల్లడించారు. డిస్టిలరీ ఫ్యాక్టరీల అనుమతి విషయంలో ఉద్యోగాలు, ఆదాయం పెరుగుతాయని తాను అంటుంటే, ఆ అధికారి మాత్రం.. గత ప్రభుత్వంలో కేసీఆర్ కేబినెట్‌కు పంపారని తెలిపారు. గతంలో కేసీఆర్‌కు పంపిన ఫైళ్లను అడిగినా, ఇప్పటివరకూ పంపలేదని, ప్రభుత్వానికి సహకరించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
డిస్టిలరీ కంపెనీలకు లీజ్ లైసెన్స్ పొడిగించే రూల్ ఉన్నా అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదని, దీంతో ఒకే కంపెనీ ద్వారా నెలకు రూ. 23 కోట్ల చొప్పున 10 నెలల్లో రూ. 230 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని జూపల్లి తెలిపారు. ప్రభుత్వ విధులకు అడ్డు తగులుతున్న ఈ అంశాలపై ఇప్పుడేకాదు.. తాను గతంలోనే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.
