ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

ఆదిలాబాద్​ టౌన్, బోథ్, గుడిహత్నూర్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మంత్రి ఆదిలాబాద్​జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆదిలాబాద్​పట్టణంలోని కైలాశ్​నగర్​లో  రూ.25 లక్షలతో నిర్మించిన దివ్యాంగుల సంఘం భవనాన్ని, అనంతరం 3, 4వ వార్డుల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. 

స్థానిక ఎస్టీయూ భవన్​లో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం గుడిహత్నూర్​ మండల కేంద్రం నుంచి మాన్కాపూర్​వరకు రూ.3.55 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులు, సొనాల మండల కేంద్రంలో రూ.93 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం బోథ్​లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇందిరమ్మ మహిళాశక్తి చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.22 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మహిళ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని పొదుపు సంస్కృతి పెంపొందించుకోవాలని సూచించారు.

 ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.21.83 కోట్ల ఎస్​హెచ్​జీ రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్​ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, ఐటీడీఏ పీవో యువరాజ్, అడిషనల్​ కలెక్టర్లు శ్యామలాదేవీ, రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్​మల్లెపూల నర్సయ్య, డీసీసీబీ చైర్మన్​ అడ్డి భోజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య తప్పనిసరి

నిర్మల్, వెలుగు: విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య తప్పనిసరి అని మంత్రి జూపల్లి అన్నారు. సోమవారం నిర్మల్​జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడులోని బాలికల సాంఘిక సంక్షేమ స్కూల్, కాలేజీలో 13.50 లక్షలతో ఏర్పాటుచేసిన విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్​తో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నిర్మల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, డీఈవో భోజన్న, జడ్పీ సీఈవో గోవింద్ తదితరులు పాల్గొన్నా రు.

పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం..!

భైంసా, వెలుగు: ఇండ్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్​ లక్ష్యమని మంత్రి జూపల్లి అన్నారు. బైంసా మండలం ఎగ్గాంలో కండేక కవిత, ధర్మపాల్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. ఇండ్లు లేని పేదలందరికీ త్వరలోనే పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. అనంతరం భైంసాలోని సేవాలాల్​చౌక్​వద్ద రోడ్ల నిర్మాణానికి సంబంధించిన మూడు శిలాఫలకాలను ఆవిష్కరించారు.

 సీఆర్​ఐఎఫ్​ నిధులు రూ.20 కోట్లతో కుభీర్​ మండలంలోని మాలేగాం క్రాస్​ రోడ్డు నుంచి నిగ్వా మీదుగా మహారాష్ట్ర సరిహద్దు దివిసి వరకు, నాన్​ ప్లాన్ ​గ్రాంట్స్​ రూ.2 కోట్లతో భైంసా పట్టణ పరిధిలోని సేవాలాల్​ చౌక్​ నుంచి వివేకానంద చౌక్​వరకు, ఎస్​టీఎస్​డీఎఫ్​ నిధులు రూ. 5.2 కోట్లతో పార్డి నుంచి హల్దా వరకు, వీరేగాం నుంచి శివుని వరకు రోడ్డు నిర్మాణ పనులకు పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణ్​పటేల్, విఠల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.