నిథమ్‌‌‌‌ను నంబర్ వన్ చేస్తం..పర్యాటకుల్ని ఆకర్షించేలా చర్యలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

నిథమ్‌‌‌‌ను నంబర్ వన్ చేస్తం..పర్యాటకుల్ని ఆకర్షించేలా చర్యలు:  మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: పర్యాటక, అతిథ్య రంగంలో అపారమైన అవకాశాలున్నాయని, కొత్త ధోరణులపై దృష్టి సారించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌‌‌‌లోని నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌‌‌‌మెంట్ (నిథమ్)లో జాతీయ క్రీడా వారోత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని సమూహ యోగాసనాలు, ధ్యానం చేశారు. నిథమ్ యోగా శిక్షకురాలు స్మృతి పాండే ఈ శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి జూపల్లి నిథమ్ విద్యార్థులు, అధ్యాపకులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. 

నిథమ్‌‌‌‌ను అగ్రగామి సంస్థగా నిలిపేందుకు అందరూ కృషి చేయాలని, విదేశీ విద్యార్థులు, పర్యాటకులను ఆకర్షించేలా సంస్థను తీర్చిదిద్దాలని సూచించారు. కొత్త విద్యా కార్యక్రమాలు, స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెట్టాలని, విద్యా-శిక్షణ పరిధిని విస్తరించాలని, ఉద్యోగ, పారిశ్రామిక అవకాశాలను పెంచాలని దిశానిర్దేశం చేశారు. క్యాంపస్ మౌలిక సదుపాయాలు, వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలని సూచించారు.

 రాష్ట్ర ప్రభుత్వం తరపున నిథమ్‌‌‌‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్‌‌‌‌తో చర్చించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నిథమ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, అతిథ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్, ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక, అతిథ్య రంగంలో ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని కోరారు.  ఈ నెల 31 వరకు వారోత్సవాలు జరగనున్నాయి. కార్యక్రమంలో శ్రీకారా హాస్పిటల్స్ డాక్టర్ పీఎల్ఎన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.