కామారెడ్డి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

కామారెడ్డి జిల్లాను  పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • నిజాంసాగర్​లో రూ.9.97 కోట్లతో ఒకో టూరిజం అభివృద్ధి
  • అసెంబ్లీలో రాష్ర్ట మంత్రి జూపల్లి కృష్ణారావు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని రాష్ర్ట  పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాదానమిచ్చారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని జుక్కల్ నియోజక వర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు  ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 

జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తామన్నారు. కౌలాస్​ కోట, నిజాంసాగర్ ప్రాజెక్టు,  లింగంపేటలోని నాగన్నబావి( మెట్లబావి)లను అభివృద్ధి పరుస్తామన్నారు. స్వదేశ్ దర్శన్ 2లో భాగంగా నిజాంసాగర్ వద్ద రూ. 9 కోట్ల 97 లక్షలతో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కాటేజీలు, రెస్టారెంట్లు, స్పా, వెల్​నెస్ సెంటర్​ నిర్మిస్తామన్నారు. కౌలాస్​ కోటను అభివృద్ధి, రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. చారిత్రక కోటకు పునరుజ్జీవం చేస్తామన్నారు.  ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని మంత్రి పేర్కొన్నారు.

జుక్కల్​ను టూరిజం హబ్​గా మార్చాలి అసెంబ్లీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

పిట్లం : జుక్కల్ నియోజకవర్గాన్ని టూరిజం హబ్​గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్కే తోట లక్ష్మీకాంతారావు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రాష్ట్రంలోని 27 ప్రాంతాలను టురిజం పాలసీలో పొందుపరిచి, జుక్కల్ నియోజకవర్గాన్ని విస్మరించిందన్నారు.  జుక్కల్ నియోజకవర్గంలో 9 వందల ఏండ్ల కింద నిర్మించిన కౌలాస్ కోట ఉందన్నారు.

 కోట చుట్టూ 52 బురుజులు ఉన్నాయని, ప్రతి బురుజుపై ఫిరంగులు ఉన్నాయని, ప్రపంచంలోనే అతి పెద్ద ఫిరంగీ ఇక్కడే ఉందన్నారు. రాష్ట్ర కూటుల తరువాత బాదామి, కాకతీయులు పాలించారని వారి తరువాత అసఫ్​జాహీ వంశస్తులు పాలించారన్నారు. కౌలాస్​ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వంద ఏండ్ల కింద నిజాం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ నాలా ప్రాజెక్టు ఉందని తెలిపారు. 

పర్యాటక శాఖ మంత్రి జుక్కల్​లో పర్యటించినప్పుడు వరాలు ఇచ్చారని గుర్తు చేశారు. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో మూడు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయన్నారు. పక్కనే ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరంచ ఎల్లమ్మ ఆలయం ఉందని, రెండు నియోజకవర్గాలను కలిపి పర్యాటక ప్రాంతంగా మారిస్తే  దేశంలోనూ గుర్తింపు లభిస్తుందని తెలిపారు. వంద ఏండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్​ ప్రాజెక్టుకు అనుబంధంగా ఫిషరీస్ యునివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు.