- బోటు నడుపుతూ.. చేపలు పట్టి విహారం
హైదరాబాద్ , కొల్లాపూర్, వెలుగు : అధికారిక పర్యటనలతో పాటు రాజకీయాలతో తీరిక లేకుండా గడిపే పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం కృష్ణా నది బోటు షికారు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సోమశిల కృష్ణమ్మ ఒడిలో ఆహ్లాదంగా బ్యాక్ వాటర్స్ లో జల విహారం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన సోమశిల వద్దకు ఉదయం ఫ్యామిలీతో తరలివెళ్లారు.
బ్యాక్ వాటర్ లో బోటుపై ప్రయాణిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించారు. తన మనవలు, మనవరాళ్లు, కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తూ, సెల్ఫీలు దిగుతూ హాయిగా గడిపారు. ఈసారి ప్రయాణికుడిలా సాహస యాత్ర చేశారు. స్వయంగా బోటు స్టీరింగ్ పట్టుకుని కృష్ణ జలాలపై పడవలో విహరించారు. కుటుంబ సభ్యులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు.
మంత్రి జూపల్లి కాసేపు గాలంతో చేపలు పట్టారు. చేప చిక్కినప్పుడు సంబుర పడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోమశిల అద్భుతమైన పర్యాటక క్షేత్రమని, ఇక్కడి ప్రశాంతత మనసులోని అలసటను దూరం చేస్తుందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ బిజీ లైఫ్ నుంచి కొద్దిగా సమయం కేటాయించి ఫ్యామిలీతో ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలను సందర్శించాలని సూచించారు. మంత్రి రాకతో సోమశిల తీరంలో సందడి నెలకొంది. మంత్రితో స్థానిక పర్యాటకులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.
