బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ ఎటు పాయె? : విజయశాంతి

బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ ఎటు పాయె? : విజయశాంతి

బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ ఎటు పాయె?

పరిశ్రమలు తెరిపించుడు చేతకాదు కానీ మోడీపై నిందలా?.. కేటీఆర్ పై విజయశాంతి ఫైర్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించడం చేతకాని మంత్రి కేటీ ఆర్.. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయ శాంతి ఫైర్ అయ్యారు. టీఎస్ పీఎస్సీ పేపర్  లీకేజీ విషయంలో కేసీఆర్  ప్రభుత్వ వైఫల్యాలు బయటపడడంతో తెలంగాణ సమాజం చీదిరించుకుంటున్నదని, దీంతో కేటీఆర్  కొత్త డ్రామాకు తెరతీశారని ఆమె ప్రకటనలో దుయ్యబట్టారు.

కేంద్రంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఆ హామీ గురించి ప్రశ్నిస్తే  బైలడిల్ల గనుల గురించి కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ‘‘మోడీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయని కేటీఆర్  చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు. పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా మినహా ఏ ప్రభుత్వ రంగ సంస్థను కేంద్రం ప్రైవేటుపరం చేసిందో  కేటీఆర్  సమాధానం చెప్పాలి.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న బీఎస్ఎన్ఎల్, హెచ్ఈఎల్ సంస్థలకు భారీగా ప్యాకేజీ ప్రకటించి ఆదుకున్నది మోడీ ప్రభుత్వమే. రామగుండం సహా మూతపడ్డ ఐదు ఎరువుల ఫ్యాక్టరీలను రూ.వేలకోట్లు ఖర్చు చేసి పునరుద్ధరించి రైతులకు ఎలాంటి యూరియా కొరత లేకుండా నిరంతరం సరఫరా చేస్తున్న ఘనత కేంద్రానిదే” అని విజయ శాంతి పేర్కొన్నారు. తండ్రీకొడుకులు ఎన్ని డ్రామాలు ఆడినా.. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీపై బీజేపీ పోరు ఆగదని, కేటీఆర్ ను బర్తరఫ్  చేసే వరకు ఉద్యమిస్తామని ఆమె స్పష్టం చేశారు.